మహబూబ్‌నగర్ అర్బన్, సెప్టెంబర్ 10: తెలంగాణ పౌరుషాన్ని, త్యాగాన్ని, పోరాట పటిమను భావితరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన పోరాటయోధురాలు, తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తా సమీపంలో ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటం వద్ద మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో మొదటి వీర వనిత ఐలమ్మ అన్నారు. భూమి కోసం.. భుక్తి కోసం పోరాటం చేసిన యోధురాలన్నారు. భర్తను, కొడుకును కోల్పోయినా చివరి వరకు పోరాటం చేస్తూ నిరంకుశ నాయకులను తరిమికొట్టిన ధీశాలన్నారు. మహబూబ్‌నగర్‌లో ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
బీసీలను ఇన్నాళ్లూ ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, స్వరాష్ట్రం వచ్చాక తగిన ప్రాధాన్యం లభిస్తుందని తెలిపారు. ఐలమ్మ ఆత్మ గౌరవ భవనానికి రెండు ఎకరాల భూమి, రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, కౌన్సిలర్లు, రజక సంఘాల నేతలు, నాయకులు పాల్గొన్నారు.
పాలమూరు, సెప్టెంబర్ 10: పేదల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని ఎక్సైజ్,క్రీడలు,పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ గ్రామీణ మండలం ధర్మాపూర్, జమిస్తాపూర్, తెలుగుగూడెంలో సీసీ రోడ్లు ప్రారంభించి, నూతన ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మాపూర్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కర్వెన రిజర్వాయర్ పూర్తయ్యే దశలో ఉందని, వచ్చే సంవత్సరం సాగునీరు అందిస్తామన్నారు.
ధర్మాపూర్ చెరువును నింపి తీరుతామన్నారు. ధర్మాపూర్, జమిస్తాపూర్, తెలుగుగూడెం గ్రామాల ప్రజలకు హెల్త్ క్యాంప్ నిర్వహించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ సీతారామారావును ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో అనిల్‌కుమార్, ముడా డైరెక్టర్ ఆంజనేయులు, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, తాసిల్దార్ పాండునాయక్, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, సర్పంచులు శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్రయ్య, మమత పాల్గొన్నారు.