‘గణపతి బప్పా మోరియా’.. అంటూ భక్తులు వినాయకుడికి ఘన వీడ్కోలు పలికారు. జిల్లావ్యాప్తంగా వివిధ మండపాల వద్ద 11 రోజులపాటు విశేష పూజలందుకున్న గణనాథులను శనివారం రాత్రి నిమజ్జనానికి తరలించారు. శోభాయాత్రలు కనులపండువగా జరిగాయి. యువకులు, మండపాల నిర్వాహకులు, భక్తుల భజనలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మహిళల బొడ్డెమ్మలు ఆకట్టుకున్నాయి. వినాయకుల శోభాయాత్రలో పురాణ, ఇతీహాసాలకు, ప్రస్తుత సంఘటనలకు సంబంధించిన అలంకరణలు చేపట్టారు.
బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్, పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వాగత సభలు ఏర్పాటు చేసి గణనాథులకు స్వాగతం పలికి నిర్వాహకులకు మెమెంటోలు అందజేశారు. పలుచోట్ల అన్నదానం చేశారు, లడ్డూ వేలంలో భక్తులు పోటాపోటీగా పోటీపడి దక్కించుకున్నారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బందోబస్తును పోలీస్ అధికారులు పర్యవేక్షించారు. నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడంతో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 10