మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 6: భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కోయిల్‌సాగర్, జాతీయ రహదారులు తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పునరావాస కేంద్రంలో విద్యుత్ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపు, సర్వే త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు బుధవారం రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కే సీతారామారావు, ఆర్డీవో అనిల్‌కుమార్, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జిల్లా చీఫ్ ఇంజినీర్ రమణారెడ్డి, పీఆర్ఎల్ఐ ఇంజినీర్లు ఉదయశంకర్, రమేశ్, జాతీయ రహదారుల సంస్థ డీఈ రమేశ్, అధికారులు, ఆయా మండలాల తాసిల్దార్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన
కలెక్టరేట్లోని ఈవీఎంలను భద్రపరుస్తున్న భవనాన్ని కలెక్టర్ వెంకట్రావు మంగళవారం ప్రత్యేకంగా పరిశీలించారు. పోలీసుల సమక్షంలో గోదాంను తెరిపించి గోదాంలో ఉన్న ఎలక్ట్రానిక్ యంత్రాలను తనిఖీ చేశారు. అనంతరం గోదాంకు సీల్ వేయించారు. ఈవీఎం గోదాం చుట్టూ పరిశీలించి భద్రత కట్టుదిట్టంగా ఉండాలని అధికారులు, పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.