మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 6: ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు మహబూబ్‌నగర్ పురపాలిక శాఖ శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా గత ఏడాది జూలై 1 నుంచి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వస్తువుల, ఉతత్తులపై కేంద్రం నిషేధం అమలుల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం 75 మైక్రాన్స్ కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు, ఒకసారి పార వేసే ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్స్ అమ్మినా, వాడినా, నిల్వ చేసినా, దిగుమతి చేసుకున్న పంపిణీ చేసిన రూ.1000 నుంచి రూ.25వేల జరిమానాతో పాటు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు. దుకాణ యజమానులు చెత్తను తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలుగా విభజించడానికి తమ సొంత డబ్బాలను దుకాణం వద్ద ఏర్పాటు చేసుకోవాలి. చెత్తను మున్సిపల్ వాహనాలకు అందజేయాలి. ఇట్టి నియమాలను ఉల్లంఘించిన వారి రూ.1000 నుంచి రూ.10000 వరకు జరిమానా విధిస్తారు.
స్పెషల్ డ్రైవ్ ప్రారంభం
ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు మహబూబ్‌నగర్ పురపాలిక శాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రత్యేక బృందాలు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి దుకాణానికీ కరపత్రాల పంపిణీతోపాటు షాపుల్లో స్టిక్కర్లు వేసే కార్యక్రమం పూర్తి చేశారు. దుకాణాదారుడి అవగాహన కల్పించి రికార్డులో సదరు షాపు యజమాని సంతకాలు తీసుకున్నారు. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు వాడితే భారీ జరిమానాతోపాటు చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నారు. స్పెషల్ నిర్వహణలో ముగ్గురు పారిశుధ్య విభాగ అధికారులు, హెల్త్ అస్టిస్టెంట్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ దాదాపు రూ.లక్షా 50వేల వరకు జరిమానా విధించారు. 700కిలోల ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్లాస్టిక్ వాడితే జరిమానా..
ప్లాస్టిక్ కవర్లు వాడితే చర్యలు తప్పవు. 75 మైక్రాన్స్ కన్నా తక్కువ మందంగల ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు, గ్లాసులు, ప్లేట్స్ అమ్మినా, వాడినా నిల్వ చేసినా రూ.1000 నుంచి జరిమానా విధిస్తాం. స్పెషల్ డ్రైవ్‌కు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. ఇప్పటికీ రూ.లక్షా 50వేల జరిమానా వసూలు చేశాం. ప్రజలు జ్యూట్ బ్యాగులు వాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
– ప్రదీప్‌కుమార్, మహబూబ్‌నగర్, మున్సిపల్ కమిషనర్