ఊట్కూర్, సెప్టెంబర్ 6: గణేశ్ నిమజ్జన వేడుకలను పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ వెంకటేశ్వర్లు పోలీసులను ఆదేశించారు. మక్తల్ సీఐ సీతయ్య, ఊట్కూర్, మక్తల్ ఎస్సైలు రాములు, పర్వతాలుతో కలిసి మంగళవారం ఎస్పీ ఊట్కూర్ పెద్ద చెరువును సందర్శించారు. భారీ వర్షాలతో స్థానిక పెద్ద చెరువుతో పాటు పరిసర గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండుగా ఉన్నందునా ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకుముందు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సిబ్బందితో సమావేశమై మండలకేంద్రంలో ఈనెల 8న రాత్రి శోభాయాత్ర మొదలుకొని శుక్రవారం నిమజ్జనం పూర్తయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో పీఆర్వో వెంకట్ పాల్గొన్నారు.
ఏర్పాట్లపై సమీక్ష
మక్తల్ అర్బన్, సెప్టెంబర్ 6: వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం మక్తల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సీఐ సీతయ్య,ఎస్సై పర్వతాలు పోలీసు సిబ్బందితో కలిసి 10న మక్తల్ పట్టణంలోని జరిగే నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షించారు. నిమజ్జనానికి వాహనాలు తరలించే రూట్ మ్యాప్, మక్తల్ పెద్దచెరువు ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, నిరంతరం పెట్రోలింగ్ చేస్తూ బందోబస్తుకు వలంటీర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ కృష్ణయ్య, పోలీసులు రాజు, నరేశ్ పాల్గొన్నారు.
గణేశ్ మార్గ్ పరిశీలన
నారాయణపేట, సెప్టెంబర్ 6: ఈనెల 9న జరుగనున్న వినాయక నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర జరిగే గణేశ్ మార్గ్‌ను మంగళవారం ఎస్పీ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు విజయ్‌సాగర్ పరిశీలించారు. నిమజ్జన సమయంలో ప్రార్థనా మందిరాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్ మల్లింపు తదితర విషయాలపై ఎస్పీ పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. వినాయకులను నిమజ్జనం చేసే కొండారెడ్డిపల్లి చెరువు వద్ద క్రేన్లను ఏర్పాటు చేయాలని, విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతి కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్సైలు సురేశ్, రమేశ్, శివనాగేశ్వర్నాయుడు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చంద్రకాంత్, శివరాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.