అయిజ, సెప్టెంబర్ 6 : కర్ణాటకలోని తుంగభద్ర జ లాశయానికి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. మంగళవారం ఇన్‌ఫ్లో 58,969, అవుట్‌ఫ్లో 38,056 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 104.343 టీఎంసీలకు చేరిందని డ్యాం ఎస్ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. నీటిమట్టం 1633 అడుగులకుగానూ 1632.64 అడుగులకు చేరింది. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 61,190 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 60,700 క్యూసెక్కులుగా నమోదైంది. ఆయకట్టుకు 490 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం 11.5 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
శ్రీశైలం డ్యాంలో..
శ్రీశైలం, సెప్టెంబర్ 6 : శ్రీశైలం జలాశయానికి వరద నిలకడగా వస్తున్నది. దీంతో డ్యాం రెండు గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం జూరాల ప్రాజెక్టు గేట్ల నుంచి 20,615, విద్యుదుత్పత్తి నుంచి 43,777, సుంకేసుల నుంచి 50,064, హంద్రీ నుంచి 117.. మొత్తం 1,38,874 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా న మోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు గేట్ల నుంచి 55,692 క్యూసెక్కులు, ఏపీ పవర్‌హౌస్‌కు 31,187, టీఎస్ పవర్‌హౌస్‌కు 31,784 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులకుగానూ ప్రస్తుతం 884.50 అడుగులకు చేరగా.. సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా.. 212.9198 టీఎంసీలకు చేరినట్లు అధికారులు తెలిపారు.
రామన్‌పాడు గేట్లు ఓపెన్..
మదనాపురం, సెప్టెంబర్ 6 : రామన్‌పాడు గేట్లు ఓపెన్ అయ్యాయి. ప్రాజెక్టుకు ఎగువనున్న శంకర సముద్రం నుంచి భారీగా వరద వస్తుండడంతో మదనాపురం మారెడ్డిపల్లి వాగు ఉధృతంగా పారుతున్నది. ఈ నీరంతా రామన్‌పాడుకు చేరడంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు మూడు గేట్లు తెరిచారు. దీంతో మండల కేంద్రంలోని రైల్వేగేటు సమీపంలో మదనాపురం-ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు పర్యవేక్షణ చేసి ఉధృతి తగ్గాక వాహనాల రాకపోకలకు అనుమతినిచ్చారు. రాత్రి వేళల్లో వరద పెరిగే అవకాశం ఉన్నదని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్సై గోపాల్‌రెడ్డి తెలిపారు.