ఆంధ్రాకు ఒంగోలు గిత్త.. తమిళనాడుకు కుల్లికులం.. కర్ణాటకకు హల్లికర్.. కేరళకు పెచ్చూరు.. నల్లమలకు తూర్పుపొడ ఎద్దులు పేరొందాయి. తెల్లటి చర్మంపై గోధుమ రంగు మచ్చలు, గోధుమరంగు తోలుపై తెల్లటి మచ్చలు ఈ జాతి ప్రత్యేకత. ఇతర పశుజాతితో పోల్చితే ఇవి ఎంతో విలక్షణమైనవి. 400 ఏండ్లుగా వీటిని పోషిస్తూ రైతులు కాపాడుకుంటున్నారు. ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకోగల ప్రత్యేక బ్రీడ్. తెలంగాణలో ఉదయించిన బలిష్టమైన గిత్తలు. అందుకే జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి.
అమ్రాబాద్, సెప్టెంబర్ 6 : తూర్పు పొడ పశుజాతి.. నల్లమల అటవీ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పశు జాతిని నేషనల్ బయో యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్ఏబీజీఆర్) తెలంగాణ స్థానిక పశుజాతిగా గుర్తించింది. ఎన్ఏబీజీఆర్ దేశవ్యాప్తంగా గుర్తించిన 50 పశు జా తుల్లో తూర్పు పొడ కూడా ఒకటి. ఎన్ఏబీజీఆర్ జాబితాలో పొడతూర్పునకు 44వ సీరియల్ నెం బర్గా నమోదైంది. తెలంగాణలో గుర్తింపు పొం దిన ఏకైక పశు జాతి తూర్పు పొడ మాత్రమే. సూటి, పదునైన కొమ్ములను కలిగి ఉంటాయి. అన్ని కాలాల్లో ఈ పశువులు వ్యవసాయ పనులు చాలా సమర్థవంతంగా చేస్తాయి. వీటి ఉత్పాదక శక్తి చాలా ఎక్కువ.
నీరు, మేత తక్కువగా తీసుకోవడం ఈ పశువుల ప్రత్యేకత. ఎత్తైన కొండలు, కోనల్లోకి సులభంగా ఎక్కేలా వీటి గెట్టలు అ త్యంత బలంగా ఉంటాయి. 8 కి.మీ. ఎత్తయినా అమాంతం ఎక్కేస్తాయి. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరిచినప్పుడే సునాయసంగా నదిని ఈదేంత బలం ఉన్న పశు జాతి ఇది. నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే ఈ పశువులు పులులను సైతం ఎదురొడ్డి నిలబడతాయని స్థానికులు చెబుతారు. అచ్చం పులిని మరిపించేలా చారలను కలిగి ఉండడం ఈ పశుజాతి ప్రత్యేకత. బారెడు కొమ్ములు, మూరెడు మూపురం, నేలను తాకే గంగడోలు..
కొండనైనా లాగేంత కండల బలం, కాడి కడితే చాలు ఎంతటి బరువునైనా సునాయాసంగా లాగేసే బలిష్టం.. ఎంత దూరమైనా పరుగెత్తే బలం ఈ పశు జాతి ప్రత్యేకత. అధిక ఉష్ణోగ్రత, గజగజ వణికించే చలిలోనూ ఉత్సాహంగా పనిచేస్తాయి. వీటి కాళ్ల గిట్టలు దృఢంగా ఉండడంతో ఎంత పనిచేసినా అలసిపోవు. ఆవులు పగలంతా వ్యవసాయం చేసిన తర్వాత కూడా ఒక్కపూటకు 3 నుంచి 5 లీటర్ల పాలు ఇస్తాయి. ఇలా పాడితోపాటు వ్యవసాయానికి అనుకూలంగా ఉండడంతో వీటిని ఎంతరేటు పెట్టయినా సరే కొనేందుకు రైతులు ఆసక్తి చూపుతుంటారు. పులి ఆ ప్రాంతంలో తిరిగినా గుర్తిస్తాయి.
దొర పొడ లు, ఎర్ర పొడలు, తెల్ల పొడలు, పుల్ల బట్ట, తెల్ల బట్ట, పాల బట్ట, ఎరుపు, నలుపు రకాల పశువులున్నాయి. ఎరుపు గోధుమ రంగు మచ్చలు కలిగిన ఈ గిత్తలకు కొమ్ములు నిటారుగా ఉంటాయి. ఈ జాతి పశువులు వర్షం రాకను రెండు, మూడు రోజుల ముందుగానే గుర్తించి గమ్యస్థానానికి చేరుకుంటాయని పెంపకందారులు చెబుతున్నా రు. ఇవి బురదలో, రాతి నేలలతో పాటు కొండ లు, గుట్టల్లోను సనాయాసంగా నడుస్తాయి. నీటిలో వేగంగా ఈదగలడం వీటి ప్రత్యేకత. బురదలో సైతం సులువుగా దున్నగలవు. ఈ మచ్చల పశువులు గట్టిదనానికి కారణమైన జన్యులక్షణం పొడి వాతావరణంలో కూడా అవలీలగా బతికేలా ఉంటుందని జీవవైవిధ్య సంస్థ అధ్యయనంలో తేలింది.
నల్లమల ప్రాంత రైతులు ఇక్కడి ఈ మచ్చల జాతి పశువులతోనే తాత ముత్తాల నుంచే వ్యవసాయం చేస్తున్నారు. అమ్రాబాద్ మండలంలోని లక్ష్మాపూర్ తండా నుంచి నల్లమల ప్రాంతంలోని దట్టమైన వజ్రాలమడుగు, గుండం, కొల్లం, గుజనేనిగడ్డ, మల్లెలరేవు, చిన్నమాల్బండ, బోల్గెట్టి, ముత్యాలమ్మగడ్డి, నల్లమల పరిధిలోని కృష్ణానదీ తీరం తదితర ప్రాంతాలకు మేతకు తీసుకెళ్తుంటారు.
ఇలా ఎన్నో విశిష్ట జన్యుపరమైన లక్షణాలున్న ఈ పశు జాతి ఇప్పుడు తెలంగాణకే గర్వకారణంగా నిలుస్తున్నది. ఇన్నాళ్లు స్వరాష్ట్రంలో కనీసం ఓ ప్రత్యేకమైన పశుజాతి కూడా లేని పరిస్థితి నుంచి మనకో పశు జాతి ఉందంటూ గర్వం గా చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది. ఈ అరుదైన జ్యాతి పశువులు ఇప్పుడు తెలంగాణ రాష్ర్టానికే ఖ్యాతి తెచ్చిపెట్టాయి. నల్లమల అటవీ ప్రాంతం లో ఎక్కడ చూసినా పొడ జాతి పశువులు మనకు దర్శనమిస్తుంటాయి. అలాంటి వాటిని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది.
ఈ జాతిని అంతరించిపోకుండా కాపాడేందు కు కృషి చేస్తున్నారు. తెలంగాణ జీవవైవిధ్య సంస్థతో పాటు, వాసన్ స్వచ్ఛంద సంస్థ వీటికి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేశాయి. వీటికి అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో ఇక్కడి పశువులకు డిమాండ్ పెరిగి వీటిని పోషిస్తున్న రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ద్వారా సబ్సిడీ రుణాలు తీసుకునే క్రమంలోనూ ఇకపై ఈ జాతి పశువులను అధికారికంగా కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడింది.
అరుదైన గుర్తింపు..
ప్రతి రాష్ర్టానికి ఆయా ప్రదేశాల వాతావరణాలకు తగ్గట్లుగా పెరిగే జాతి పశువులను గుర్తించి వాటి అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేస్తుంటాయి. అదేవిధంగా దేశంలో దాదాపుగా 39 రకాల పశు జాతులను గుర్తించి.. వాటిని సంరక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు గిత్త, పుంగనూరు ఎద్దులు, తమిళనాడులో ఉంబ్లాచెరీ, పుల్లికులం, కర్ణాటకలో అమృత్ మహల్, కృష్ణవ్యాలీ, హల్లికర్, కేరళలో పెచ్చూరు జాతి పశువుల మాదిరిగానే తెలంగాణలోని నల్లమల తూర్పు పొడజాతి పశువులకు విశిష్టత ఖ్యాతి దక్కింది.
తూర్పుపొడకు అధికార గుర్తింపుకోసం తెలంగాణ ఆవిర్భావం నుంచి ఎంతో కృషిచేశారు. 2015లో గ్రామాల్లో తిరిగి రైతులు సంఘాల ఏర్పాటుకు ప్రయత్నించినా.. ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి. గోపాల మిత్ర సంఘాలు ఎంతగానో కష్టించి పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దృష్టికి తీసుకుపోగా.. ఆయన అమ్రాబాద్ మండలం బీకే లక్ష్మాపూర్ గ్రామ సమీపంలోని నరసింహ వాగు వద్ద అప్పటి కలెక్టర్ ఆధ్వర్యంలో మొదటి సభను ఏర్పాటుచేశారు. తెలంగాణ పశుసంవర్ధక శాఖ ప్రముఖ పాత్రతో దేశ విదేశాలు, రాష్ర్టాల వారిని పిలిపించి వీటి ప్రాముఖ్యతను వివరించారు. దీంతో ఫిబ్రవరి 18, 2020న జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
మార్కెట్లో మంచి గిరాకీ..
ప్రత్యేక విశిష్టతలు కలిగిన తూర్పు పొడ పశువులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. కోడె గిత్తకు రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు డిమాండ్ ఉంది. వీటి దూడలకు అంతే డిమాండ్ ఉంటుంది. ఏడాది వయసున్న దూడలను కూడా కనీసం రూ. 25వేల నుంచి 40వేల వరకు విక్రయిస్తారు. వీటిని ప్రసిద్ధిచెందిన కురుమూర్తి జాతర ఉత్సవాల్లో బేరానికి పెడతారు. ఈ పశువులను కొనడానికి కర్ణాటక, ఏపీ నుంచి కూడా తరలివస్తారు. పశుగ్రాసం కోసం జూలై నుంచి నవంబర్ మాసాల్లో కృష్ణానది పరీవాహకంగా ఉన్న అడవిలోని ఎర్రపెంట, ఎర్రచేను, మురుసుల పెంట, మర్రిమడుగు, బండమానుచెలుక, నల్లజాని, చెదలగుమ్మి, ఉమ్మెంత ఊట, కోతల కురువ, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన హనుమాన్పూర్తండా, వెల్దుర్థి, రాకారంపుడి, సత్తెనపల్లి, అగ్రహారం తదితర ప్రాంతాలకు వలస వెళ్లి పోషిస్తుంటారు.