గట్టు, సెప్టెంబర్ 6 : బతికున్న వ్యక్తిని రికార్డుల్లో చంపేసి రైతుబీమా సొమ్ము స్వాహా చేసిన సంఘట న మరువకముందే గట్టులో మరో అక్రమం వెలుగుచూసింది. ప్రభుత్వ భూమికి సంబంధించి పట్టాదారు బతికుండగానే.. అధికారులు విరాసత్ పూర్తిచేయడంతోపాటు సంబంధం లేని ముగ్గురు వ్యక్తులకు పట్టా మార్పిడి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 1న విరాసత్ జరగగా.. ఆ నోటా ఈ నోటా పడి ఇటీవల వెలుగుచూసింది.
ధరూర్ మండలం ర్యాలంపాడుకు చెందిన మిద్దె సవరమ్మకు ‘218/97/అ’ సర్వే నెంబర్లో 4 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. కాగా ఆమె చనిపోయినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి ఆలూరుకు చెందిన వెంకటన్న, గోవిందప్ప, మహేశ్వరమ్మ వరుసగా 1.13 ఎకరాలు, 1.13 ఎకరాలు, 1.14 ఎకరాలను విరాసత్ కింద పట్టా చేసుకున్నారు. ప్ర భుత్వ భూమికి సంబంధించి వారసులకు మా త్రమే విరాసత్ అవుతుంది. కానీ ఇందుకు భిన్నం గా విరాసత్ చేశారు. అదీ బతికున్నప్పుడే.. విరాసత్ ఏ విధంగా జరిగింది..? అసలు కారకులు ఎవ రు..? అధికారుల పాత్ర ఏమైనా ఉందా..? అనే అ నుమానాలు కలుగుతున్నాయి.
కాగా, ఈ ప్రభుత్వ భూమి సవరమ్మకు కూడా ఆలూరుకు చెందిన ఖా జా నుంచి అక్రమంగా వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన తాసిల్దార్ ఆధ్వర్యంలోనే విరాసత్ జరిగినట్లు అధికారుల ద్వారా తెలుస్తున్నది. కొందరు నాయకులు అధికారులను తప్పుదోవ పట్టించి ఈ అక్రమానికి పాల్పడినట్లు మరో వాదన కూడా వినిపిస్తున్నది. ఇదిలా ఉండగా, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 1న జరిగిందని తాసిల్దార్ రమేశ్‌కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి ఆర్డీవో విచారణకు ఆదేశించారని, పూర్తి నివేదికను పంపనున్నట్లు చెప్పారు. బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
అక్రమ విరాసత్పై వాంగ్మూలం సేకరణ
అక్రమ విరాసత్పై రెవెన్యూ అధికారులు దృష్టిసారించారు. మంగళవారం మిద్దె సవరమ్మతోపా టు పట్టామార్పిడి చేయించుకున్న రైతులను తాసిల్దార్ కార్యాలయానికి పిలిపించి వాంగ్మూలం సేకరించారు. సవరమ్మకు ప్రభుత్వ పొలం ఎలా సంక్రమించింది? సవరమ్మ నుంచి వెంటకన్న, గోవిందమ్మ, మహేశ్వరమ్మకు పొలం ఏవిధంగా పట్టామార్పిడి చేశారనే దానిపై ఆరా తీశారు. తాసిల్దార్ రమేశ్‌కుమార్ మాట్లాడుతూ పూర్తి నివేదికను ఉన్నతాధికారులను పంపనున్నట్లు తెలిపారు.