డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, అధికారులు సర్వేపల్లి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయులను వివిధ సంఘాల సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఉపాధ్యాయులకు పలు క్రీడాపోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఊట్కూర్ మండలంలోని చిన్నపొర్ల జెడ్పీహెచ్ఎస్లో (పీటీఐ)డ్రాయింగ్ టీచర్‌గా పని చేస్తున్న లక్ష్మణ్ సర్వేపల్లి చిత్రపటం గీసి నైపుణ్యతను ప్రదర్శించాడు. కాగా, మండలకేంద్రానికి చెందిన లక్ష్మణ్ చిన్నతనం నుంచే విలక్షణమైన చిత్రకారుడిగా గుర్తింపు పొందాడు.
జిల్లాకేంద్రంలోని నైపుణ్య శిక్షణ సెంటర్లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 29 మందిని శాలువా, పూలమాలతో సన్మానించారు. పలువురు మాట్లాడుతూ సమాజ మార్గనిర్దేశకులు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదన్నారు. అన్ని రంగాల కన్న ఉపాధ్యాయ రంగం ఎంతో గొప్పదన్నారు. ఉపాధ్యాయుల సేవలు అన్ని రంగాలకు కీలకమన్నారు.