మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికామని, రాష్ట్రంలోనే పాలమూరును నెంబర్‌వన్‌గా నిలబెడ్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరారు. మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్ ఆధ్వర్యంలో 25వ వార్డుకు చెందిన ఆటోమెకానిక్ యూనియన్ నాయకులు కూడా గులాబీ గూటికి వలస వచ్చారు.
వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా మంత్రి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ అభివృద్ధికి కేరాఫ్‌గా మారుతున్న పాలమూరు పట్టణంలో కలహాలు రేపేందుకు కొందరు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అలాంటి వారిపై జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో చిచ్చుపెట్టే యత్నం జరుగుతున్నదన్నారు. కులం, మతం పేరుతో రెచ్చగొట్టే చర్యలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. అన్ని మతాలకు, కులాలకు అండగా నిలిచిన ప్రభుత్వం మాదే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ది పనులతో తమ జీవితాలు బాగుపడ్తాయని భరోసా కల్పించామన్నారు.
పాలమూరులో బతుకు దెరువును చూపించామని చెప్పారు. గతంలో జిల్లాలో ఉపాధి లేక సుమారు 14 లక్షల మంది ముంబై, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని, కానీ తెలంగాణ ఏర్పడ్డాక పూర్తిగా మార్పు వచ్చిందన్నారు. నిరంతర విద్యుత్, రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాలతో వలస వెళ్లిన వారంతా తిరిగి సొంతూళ్లకు వస్తున్నారని తెలిపారు. సాగునీరు అందుతుండడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాలనుకునే ఆలోచనను విరమించుకున్నారని చెప్పారు.
ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంతోనే సాధ్యమైందన్నారు. ప్రతియువతకు ఇక్కడే ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టీఆర్ఎస్లో చేరిన వారికి అండగా ఉంటామన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, కౌన్సిలర్ రాంలక్ష్మణ్, వాజిద్, నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధిని అడ్డుకోవడం బీజేపీ నైజం
డబుల్ బెడ్రూం ప్రారంభోత్సవంలో మంత్రి
పాలమూరు, సెప్టెంబర్ 4: సాక్షాత్తు కేంద్ర మంత్రి మహబూబ్‌నగర్ వచ్చారంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చి రూ.కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పేందుకని భావించామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. కానీ వీరి వైఖరి చూస్తుంటే పాలమూరుకు నిధులు ఇవ్వడం పక్కన పెట్టి ప్రజలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించడమే వీరి నైజం అని అర్థమవుతుందని విమర్శించారు.
మహబూబ్‌నగర్ రూరల్ మండలం వెంకటాపూర్,మాచన్‌పల్లి తండాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. సాగునీరు పారించాలని తాము చూస్తుంటే బీజేపీ నేతలు మాత్రం రక్తం పారించాలని చూస్తున్నారని విమర్శంచారు. భారత్ మాల పోగొట్టాలి,అభివృద్ధి జరగనివ్వొద్దని కుట్రలు పన్నుతున్నారన్నారు. డబుల్ బెడ్రూం, పింఛన్లకు ఎవరైనా డబ్బులు అడిగితే ఎంతటి వారినైనా వదిలి పెట్టేది లేదని మంత్రి హెచ్చరించారు. ముగ్గురు ఆడపిల్లలున్న తండ్రి కిషన్ తన ఇల్లు కోల్పోయి ఆవేదనతో ఉన్న కుటుంబం ఇప్పుడు దర్జాగా డబుల్ బెడ్రూం ఇంట్లోకి గృహప్రవేశం చేశారని తెలిపారు.
మాచన్‌పల్లి తండాలో రూ3.23 కోట్లతో నిర్మించిన 64 డబుల్ బెడ్రూం ఇండ్లకు లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించడంతోపాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, రూరల్ తాసిల్దార్ పాండూనాయక్, ఆర్ఐ క్రాంతికుమార్‌గౌడ్, ఎంపీవో నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, వైస్ ఎంపీపీ అనిత, ముడా డైరెక్టర్ ఆంజనేయులు, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మల్లు దేవేందర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.