మక్తల్ టౌన్, సెప్టెంబర్ 4: సర్కార్ పాఠశాలల్లో తరగతుల వారీగా సాధించాల్సిన విద్యా ప్రణాళికలను ఎస్సీఈఆర్టీ అధికారులు 1,2 తరగతులకు 4 విద్యాప్రమాణాలు 3,4,5వ తరగతులకు 6 విద్యా ప్రమాణాలను లక్ష్యంగా విధించారు. వీటన్నింటినీ విద్యార్థులు సాధించే విధంగా పాఠశాల పని దినాల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారనే లక్ష్యంతో 140రోజులపాటు తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమంలో టీచర్ల పాత్ర ముఖ్యంగా ఉండాలని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహించే అందరూ ఉపాధ్యాయులకు గత నెల జూలై 30నుంచి ఆగస్టు 2వరకు మొదటి విడుత, ఆగస్టు 3 నుంచి 6వరకు రెండో విడుత, ఆగస్టు 8 నుంచి 11 వరకు మూడు విడుతలుగా ఉపాధ్యాయులకు తొలిమెట్టు శిక్షణను పూర్తి చేశారు. 1, 2 తరగతుల విద్య ప్రమాణాలు వినడం, మాట్లాడడం, చదవడం, రాయడంతోపాటు సృజనాత్మకత, 3,4,5 తరగతుల విద్యాప్రమాణాలు వినడం, ఆలోచించి మాట్లాడటం, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం ఆలోచించి సొంత మాటల్లో రాయడం (స్వీయ రచన), పదజాలం, సృజనాత్మకత/ప్రశంసా, భాషను గుర్తించి ప్రతి విద్యార్థి తెలుసుకొనే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు.
నారాయణపేట జిల్లాలోని 11మండలాల్లో 339 ప్రాథమిక పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 24,782 మంది విద్యార్థులకు తొలిమెట్టు ద్వారా కనీస సామర్థ్యాలతో పాటు తరగతి వారి సామర్థ్యాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతినెలా కార్యక్రమంపై సమీక్షలు చేపట్టి మానిటరింగ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి మండలంలో విషయాల వారీగా నలుగురు చొప్పున మండల రిసోర్స్పర్సన్లను నియమించి వారికి తొలిమెట్టుపై ప్రత్యేకమైన శిక్షణను ప్రభుత్వం అందించింది. వారి ద్వారా మండలంలోని ఉపాధ్యాయులకు శిక్షణను అందించారు.
మార్గదర్శకాలు.. నేపథ్యం
విద్యార్థులకు (1 నుంచి 5వ తరగతి వరకు ) మౌలిక భాష, గణిత సామర్థ్యాల సాధన కోసం తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రభుత్వం 2022-23 విద్యాసంవత్సరంలో అమలు పర్చింది. ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్థికి ప్రణాళికాబద్ధ్దంగా బోధనాభ్యసన కార్యక్రమాలను అమలుపర్చే విధంగా చర్యలు చేపట్టింది. 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో మొదట 2 నుంచి5వ తరగతి విద్యార్థులకు తరగతిలో కొనసాగుటకు అవసరమైన కనీస సామర్థ్యాల మీద దృష్టి పెట్టింది. సెప్టెంబర్ మాసం నుంచి తరగతులు, సామర్థ్యాల వారీగా అభ్యసన ఫలితాల సాధనకు కృషి చేయాలని అధ్యాపకులకు వార్షిక ప్రణాళిక, వారాంతపు పాఠ్యప్రణాళిక ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను వెలికి తీయాలని ఆదేశాలు జారీ చేసింది.
బోధనాభ్యసన ప్రణాళికలు
ఈ విద్యాసంవత్సరంలో మొత్తం పని దినాలు 225 రోజుల్లో బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణకు 140 రోజులు (28 వారాలు) దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ ప్రణాళికలను రూపొందించింది. సాధారణంగా వారానికి 6 పని దినాల్లో 5 రోజులు బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణకు, ఒక రోజు మూల్యాంకనం, పునరభ్యాసనానికి కేటాయించారు.
విషయ పరిజ్ఞానం పెంపొందుతుంది
తొలిమెట్టు కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థిలో విషయ పరిజ్ఞానం పెంపొందడంతో పాటు సామర్థ్యాల సాధన అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులు చక్కటి రీతిలో సరళ, గుణింత, ఒత్తు పదాలు చదవడం, రాయడంతోపాటు ఆంగ్ల భాషలోఅభివృద్ధి చెందుతారు.
– చంద్రశేఖర్ ఎంపీపీఎస్, జీపీ మక్తల్
ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం
విద్యార్థి ప్రతివిషయంలో విషయ పరిజ్ఞానం, సామర్థ్యాల పెరుగుదల చక్కటి నైపుణ్యాలు విద్యార్థిలో అలవర్చుకోడానికి తొలిమెట్టు ఉపయోగపడుతుంది. ధారాళంగా చదవడం, చదివినది అర్థం చేసుకోవడం, ఆంగ్లంలో చదవడం, రాయడం, గణితంలో చతుర్విద ప్రక్రియలతో విద్యార్థికి మేలు.
– హిమబిందు, మక్తల్ మండల రిసోర్స్ పర్సన్
సామర్థ్యం పెంపొందుతుంది
విద్యార్థిలో ప్రాథమిక స్థాయి సామర్థ్యాలు పెంపొందించి అనర్గళంగా చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలు పెంపొందించాలనే లక్ష్యంతో తొలిమెట్టు రూపొందించాం. అన్ని ప్రాథమిక పాఠశాలలో స్థాయిని పెంపొందించే విధంగా బోధనాభ్యసనాలను చేపడుతున్నారు.
– గోవిందరాజులు, డీఈవో నారాయణపేట