ఖిల్లాఘణపురం, సెప్టెంబర్ 3 : కాకతీయుల కాలంనాటి కట్టడాలు అలరిస్తున్నాయి. ఖిల్లా గట్టు అందాలు.. హరివిల్లులా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నది. కాకతీయుల పాలనలో ఖిల్లా గట్టుకు ప్రత్యేక స్థానం ఉన్నది. శత్రు సైన్యాన్ని పసిగట్టి నాశనం చేసేందుకు ఖిల్లా గట్టుపై ఎత్తైన ప్రాంతంలో ఫిరంగిని ఏర్పాటు చేసుకున్నారు. నేటికీ ఈ ఫిరంగి చెక్కు చెదరకుండా ఉన్నది. ఫిరంగి వరకు వెళ్లాలంటే మూడు ముఖద్వారాలను దాటుకుంటూ వెళ్లాలి. కాకతీయ రాజులు గణపతి దేవచక్రవర్తి పేరున మూడు దుర్గములను నిర్మించారు. మొదట రాజులు 7 కోటలు నిర్మించగా.. శత్రు సైన్యాల దాడులు ఎక్కువకావడంతో తూర్పు భాగాన ఉన్న గుట్టపై కోటను నిర్మించుకున్నారు. ఆనాటి నుంచి ఘణపురంగా ఉన్న గ్రామానికి ఖిల్లాఘణపురం అని పేరు వచ్చింది. గుట్టపై నివాస గృహాల చుట్టూ సుమారు 60 కిలోమీటర్ల మేర రాతి గోడలు నిర్మించడం విశేషం. ఖిల్లాఘణపురం నుంచి కోటలోకి వెళ్లాలంటే గారాల గుండమే తప్పా వేరే మార్గం లేకుండా కట్టుదిట్టంగా నిర్మించారు. అక్కడక్కడా సైన్యం ఉండేందుకు గదులను ఏర్పాటు చేశారు. అతిథుల కోసం కూడా ప్రత్యేక గదులు ఉన్నాయి.
కోట సమీపంలో నేతిగుండం, పాలగుండం పేరిట రెండు చెరువులను నిర్మించారు. చెరువు పైభాగాన ప్రజలు, రాజులు ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అక్కడే వ్యవసాయం చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. కోట స్థావరాల్లో ఉన్న సైన్యంతోపాటు రాజులు, ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మబ్బుచెలిమెలో ఉన్న నీళ్లు ఎంతో మధురంగా ఉండడం విశేషం. నీటిగుండం, పాలగుండం, మబ్బు చెలిమెలో ఎండాకాలంలో కూడా నీళ్లు ఉంటాయి. వీటితోపాటు ఖిల్లాఘణపురం సమీపంలోని గట్టుకాడిపల్లి గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధి గాంచింది. ఆనాటి రాజులు నిర్మించిన ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా పదిలంగా ఉన్నది. ఖిల్లా గట్టు ప్రథమ ముఖద్వారం వద్ద ఆంజనేయస్వామి ఆలయం ఉన్నది. కోటలోకి వెళ్లేందుకు గుర్తుగా అక్కడక్కడ బండరాళ్లపై ఆంజనేయస్వామి విగ్రహాలను చెక్కించారు. శత్రువుల బారినుంచి తప్పించుకోవడానికి కోటలో రహస్య స్థావరాలతోపాటు దొంగల బాటలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ గట్టును పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే ఖిల్లాఘణపురం ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. గట్టుపై ఉన్న ఎత్తైన బండలపై నుంచి రోప్‌వేల (తాళ్లు) ద్వారా కిందకు దిగడం వంటితోపాటు నీటిగుండం, పాలగుండంలో స్విమ్మింగ్ చేయొచ్చు.