వనపర్తి, జూలై 30 (నమస్తే తెలంగాణ) : పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలు అధిరోహించొచ్చని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తపన ఉన్న ప్ర తి వ్యక్తి గొప్పగా పరిణతి చెందుతాడని అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు ఉద్యోగ అభ్యర్థుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి శనివారం మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కృషితోనే చాలా మంది మహనీయులుగా ఎదిగారని, మహాత్మాగాంధీ వంటి మహోన్నతుడు కావడం వెనుక ఎంతో కృషి ఉన్నదన్నారు. అభ్యర్థుల ఆత్మవిశ్వాసం చూస్తే కచ్చితంగా ఏదో సాధిస్తారని అనిపిస్తున్నదన్నారు. ఒకసారి ప్రయాణం మొదలు పెట్టాక అనుకున్నది సాధించేదాకా ముందుకు సాగాలన్నారు.
ప్రతి రోజు సరికొత్త విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు. రైతుల మాదిరిగా సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలని కోరారు. పంట పోయినా మరో సంవత్సరం అదే సమయానికి విత్తడం రైతు మానడని అన్నారు. అవరోధాలు వచ్చినా చలించవద్దని, లక్ష్యం వైపు సాగాలని సూచించారు. తాను ఏకలవ్యుడిలా నేర్చుకున్నానని, జీవితంలో అనుభవాలే ఈ స్థాయికి చేర్చాయన్నారు. వనపర్తి డీఎస్పీ ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ కోచింగ్‌ను ఉపయోగించుకుని ఉద్యోగాలు సాధించాలన్నారు. ఇచ్చిన శిక్షణ పోలీసు ఉద్యోగాలే కాకుండా ఇతర ఉద్యోగాలకు పనిచేస్తుందన్నారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను ఇదే వేదికగా అభినందిస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు యుగంధర్‌రెడ్డి, శివకుమార్ పాల్గొన్నారు.