
జడ్చర్లటౌన్, మే29: కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను జడ్చర్ల పట్టణంలో పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లమీదకొచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. జడ్చర్ల పట్టణంలోని నేతాజీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాల వద్ద శనివారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. సీఐ వీరాస్వామితోపాటు జడ్చర్ల, మిడ్జిల్, రాజాపూర్ ఎస్సైలు షంషొద్దీన్, జయప్రసాద్, లేనిన్ పెట్రోలింగ్ చేస్తూ తనిఖీ నిర్వహించారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లమీదకు వచ్చిన ప్రతి వాహనాన్నీ తనిఖీ చేశారు. అత్యవసర పనులమీద వచ్చిన వాహనదారులు, పాస్లు చూపిన వారిని మాత్రమే అనుమతించారు. పాస్లు లేకుండా అనవసరంగా బయటకు వచ్చిన వాహనాలను సీజ్ చేసి జిల్లా పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించారు. అదేవిధంగా నంబర్ ప్లేట్లు లేని వాహనాలను సైతం సీజ్ చేశారు. అంతకుముందు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు పట్టణ ప్రధాన రహదారులు, కూరగాయల మార్కెట్, కిరాణ దుకాణాల వద్ద రద్దీ కనిపించింది. లాక్డౌన్ సమయంలో పట్టణ రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
అనవసరంగా బయటకు వస్తే చర్యలు
బాలానగర్, మే 29: ఎలాంటి అనుమతి లేకుండా వాహనదారులు అనవసరంగా బయటకు వస్తే చర్యలు తీసుకుంటామని ట్రైనీ ఎస్సై మధు అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఉదయం 10 గంటల తర్వాత తెరిచి ఉన్న దుకాణాదారులు, మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి జరిమానా విధించినట్లు తెలిపారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి జరిమానా విధించారు. లాక్డౌన్ సడలింపు సమయం అనంతరం దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయాలని సూచించారు. ఆయన వెంట కానిస్టేబుళ్లు యాదగిరిగౌడ్, తిరుపతిరెడ్డి ఉన్నారు.
ప్రశాంతంగా లాక్డౌన్
రాజాపూర్, మే 29 : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మండలంలో ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 10 గంటల తర్వాత అన్ని వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయట తిరేగే వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.