
మహబూబ్‌నగర్, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సమైక్య పాలనలో సాగునీరు అందక కొందరు రైతులు ఇబ్బందులు పడితే.. నీళ్లున్నా కరెంట్ సక్రమంగా లేక మరికొంత మంది అన్నదాతలు అవస్థలు పడ్డారు. ఇక నీళ్లు, కరెంటూ రెండూ ఉన్న చోట పెట్టుబడికి అవకాశం లేక అప్పులు చేసి ఎవుసం చేసినా అసలు, వడ్డీ కట్టలేక అలసిపోయిన రైతులు ఎందరో. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కూడా ఉన్నారు. ఊళ్లో ఉండి వ్యవసాయం చేస్తే లాభం లేదని.. భూమిని బీడుగా పెట్టి ఉన్న ఊరిని వదిలి ఇతర ప్రాంతాలకు పొట్ట చేతబట్టుకుని వలసలు వెళ్లే దుస్థితి ఉండేది. ఇదంతా గతం. 2014 తర్వాత ఉమ్మడి పాలమూరు రూపురేఖలు మారిపోయాయి. రైతుబంధు వచ్చిన తర్వాత అన్నదాత దర్జాగా వ్యవసాయం చేస్తున్నాడు. పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు పోవాల్సిన దుస్థితి తప్పింది. చాలా మంది రైతులు పంట రుణాలను రెన్యూవల్ చేస్తున్నారు తప్పించి కొత్తగా రుణాలు తీసుకునే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఒకప్పుడు భూమి భారంగా మారితే నేడు అదే భూమి అన్నదాతను ఆదుకుంటున్నది. నిరంతర ఉచిత విద్యుత్, రైతుబంధుతో సాయం చేస్తున్న సర్కారు.. రైతు పండించిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తూ అండగా ఉంటున్నది. వ్యవసాయం దండుగ అన్న పరిస్థితి పోయి నేడు పండుగగా మారింది. ఒకప్పుడు వేలల్లో ఉన్న పాలమూరు భూముల విలువ నేడు లక్షల్లోకి ఎగబాకింది.
రైతుబంధు పుణ్యమా అని..
తెలంగాణ ఏర్పాటుకు ముందు భూమి ఉన్న రై తులు సైతం సరైన నీటి సదుపాయం లేక కొందరు, నీళ్లున్నా విద్యుత్ లేక మరికొందరు, రెండూ ఉన్నా పంట పెట్టుబడి సాధ్యం కాక మరికొందరు వ్యవసా యం మానేశారు. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర దూరప్రాంతాలకు వలసలు వె ళ్లారు. మహబూబ్‌నగర్ నుంచి ముంబైకి లక్షలాది మంది వలసలు వెళ్లారు. 2000 సంవత్సరంలో భూములకు డిమాండ్ లేదు. నారాయణపేట, జో గుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్ తదితర జిల్లా ల్లో అప్పట్లో ఎకరా భూమి రూ.2 వేల నుంచి రూ.5 వేల మధ్య కూడా విక్రయించారు. అయినా కూడా భూములు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు పరిస్థితి మారిపోయిం ది. 24 గంటల ఉచిత విద్యుత్, పుష్కలంగా సాగునీరు, పంట పెట్టుబడిగా ఎకరాకు రూ.10వేల సా యం, పండిన ధాన్యాన్ని ప్రభుత్వమే ముందుకు వ చ్చి కొనుగోలు చేస్తున్న విధానం.. వెరసి పాలమూరులో వ్యవసాయం దండుగ అన్న దుస్థితి నుంచి పండుగ అనే వరకు పరిస్థితి చేరుకుంది. ముఖ్యంగా రైతుబంధుతో భరోసా ఏర్పడింది. ఏం లేకపోయి నా పంట పెట్టుబడి వస్తుంది కాబట్టి ధైర్యంగా వ్యవసాయం చేయొచ్చు అనే నమ్మకం కలిగింది. 2014 కు ముందు నారాయణపేట జిల్లాలో సుమారు 3.50 లక్షల ఎకరాల సాగు ఉండేది. అయితే రైతుబంధు, ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోలు, సాగునీటి లభ్యత పెరిగిన తర్వాత ఇప్పుడు నారాయణపేట జిల్లాలో 4.50 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాను ఇదే పరిస్థితి ఉంది. రైతుబంధు పుణ్యమా అని ఉమ్మడి జిల్లాలో ఎంతో మారుమూల ప్రాంతమైనా ఎకరా భూమి విలువ కనీసం రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చేరుకుంది. ప్రస్తుతం రైతులు భూములు అ మ్ముకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
వలసలు వాపస్..
తెలంగాణ ఏర్పాటుకు ముందు వడ్డీ వ్యాపారులు, మార్కెట్ యార్డుల్లో (గంజి) ఉండే వ్యాపారులు, ఎరువులు, పురుగుల మందుల వ్యాపారులు అన్నదాతను దారుణంగా మోసం చేసేవాళ్లు. రూ.3 నుంచి రూ.5 వరకు వడ్డీలకు అప్పులు ఇచ్చేవాళ్లు. పంట చేతికి వచ్చిన తర్వాత వ్యాపారే కొనుగోలు చేసి అసలు, వడ్డీ పట్టుకుని మిగతా ఎంతో కొంత ఇస్తే రైతులు కృష్ణారామ అనుకుంటూ ఇంటికి వచ్చే పరిస్థితి ఉండేది. మరికొంత మంది రైతులైతే పంట విక్రయించిన తర్వాత కూడా ఇంకా అప్పులు తీరని ఉదాహరణలు గతంలో అనేకం ఉండేవి. వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి రైతులు బయట పడలేక విలవిలలాడేవారు. వ్యవసాయం మానేసి వలసలు వెళ్లిన వారెందరో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి అన్నదాతకు సాగునీరు అందిస్తున్నారు. మరోవైపు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సైతం ప్రారంభం కావడంతో బోర్లు, బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసే అన్నదాతకు ప్రభుత్వం అండగా నిలిచింది. దీనికి తోడు రైతుబంధుతో ఉచితంగా పంట పెట్టుబడి సైతం ఇవ్వడంతో రైతులు వ్యాపారుల మీద ఆధారపడే పరిస్థితే లేకుండా పోయింది. దీంతో చాలా మంది వడ్డీ వ్యాపారాలు మానేశారు. మార్కెట్ యార్డులు, ఫర్టిలైజర్ దుకాణాల వ్యాపారులు సైతం రైతులు తమ వద్దకు అప్పు చేసేందుకు రావడం లేదు. రైతులు ఇప్పుడు ఎవ్వరిపైనా ఆధారపడడం లేదు. పంట పెట్టుబడిగా వచ్చిన రైతుబంధు డబ్బులతో తమకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు తమకు నచ్చిన చోట కొనుగోలు చేస్తున్నారు. పండించిన ధాన్యం కూడా దళారులెవరూ లేకుండా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసి డబ్బులు సైతం అకౌంట్లలో జమ చేస్తున్నది. దీంతో దళారీ, వడ్డీ వ్యాపారుల వ్యవస్థకు చరమగీతం పాడినైట్లెంది. రైతుబంధు పుణ్యమా అని రైతులంతా సంతోషంగా ఉన్నారు. అప్పులు చేసి వ్యవసాయం చేయలేక వలసలు వెళ్లిన వారంతా తిరిగి వచ్చారు. ఇప్పుడు సంతోషంగా తమ పంటలు తాము పండించుకుంటున్నారు.
సాగుపై ఆసక్తి పెరిగింది..
నాకున్న 2.5 ఎకరాల్లో పత్తి సాగు చేశా ను. రూ.12,500 రై తుబంధు సాయం నా బ్యాంక్ ఖాతాలో ప డింది. ఈ మొత్తంలో సాగుకు అవసరమైన పత్తి వితనాలు, కాంప్లె క్స్ ఎరువులను కొన్నా ను. గతంలో పంట పెట్టుబడి సమయంలో డబ్బుల కరువు ఉండేది. ఎన్నో ఇబ్బందులు పడి అధిక ధరలకు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసొటోళ్లం. అప్పులు మీదపడేవి. ఇప్పుడు నా కు నచ్చిన చోట విత్తనాలు, ఎరువులు కొంటు న్నా. పెట్టుబడి సాయం అందుతుండటంతో నా లాంటి రైతులకు సాగుపై ఆసక్తి పెరిగింది.
గతంలో అప్పులు చేశాం..
గతంలో పెట్టుబడి కో సం ఆసాములు వద్ద అ ప్పు కోసం వెళ్లే వాళ్లం. పంటలు పండినా పండకపోయిన అసలుతోపా టు వడ్డీ చెల్లించే వాళ్లం. ప్రస్తుతం ప్రభుత్వం రై తులకు రెండు విడుతలుగా రైతుబంధు అందిస్తుండడంతో ఇక ఆసా మి వద్ద అప్పుతో పనిలేకుండా పోయింది. రైతుబంధు రూ.36,500 వచ్చింది. ఈ డబ్బు మొత్తం వ్యవసాయానికి ఖర్చు చేస్తున్నాం. అత్యవసరమనుకుంటే క్రాప్‌లోన్ తీసుకుంటున్నా.
సాయంతో సాగు చేపట్టా..
గతంలో పొలం సాగు చేయాలంటే పెట్టుబడి కోసం బ్యాంకుల్లో క్రాప్‌లోన్ తీసుకునేవారు. రైతుబంధు పథకం అమలు చేస్తున్నప్పటి నుంచి ఎక్కువ పొలం ఉన్న రైతులు క్రాప్‌లోను తీసుకోకుండా ప్రభుత్వం అందించే సహాయంతో సాగు చే స్తున్నారు. గతంలో పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారులతో అప్పు తెచ్చుకొని పంట పెట్టుబడి కోసం ఖర్చు చేసేవాళ్లం. నాకు ఎనిమిది ఎకరాల పొలం ఉంది. రూ.40 వేలు వచ్చాయి. సాగుకు వినియోగిస్తున్నా.
పెట్టుబడి తిప్పలు తప్పాయి..
సీఎం కేసీఆర్ రైతుబందు పథకం ప్రవేశపెట్టడం తో మాకు పెట్టుబడి తిప్పలు తప్పాయి. నాకు 6 ఎకరాల పొలం ఉంది. రైతుబందు పథకం ద్వారా సీజన్‌కు రూ.30వేలు వస్తున్నాయి. ఆ డబ్బుతో సాగు చేస్తున్నాను. – వెంకట్‌రెడ్డి, రైతు, దొడగుంటపల్లి