
మహబూబ్నగర్టౌన్, జూన్ 27 : వానకాలంలో వ్యాధుల నివారణపై మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రెండేండ్లుగా కరోనాతో సతమతమవుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడుతున్నది. ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు 10 నిమిషాలు కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేపట్టాలని సూచించింది. ఎక్కడా వర్షపునీరు నిల్వ ఉండకుండా మున్సిపల్ అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కలెక్టర్ మున్సిపల్ అధికారులు, వైద్యాధికారులతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. వార్డుల వారీగా పారిశుధ్య పనులు చేపట్టడం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. అన్ని వార్డులు పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య పనులను ము మ్మరం చేశారు. ప్రధానంగా వర్షపునీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందకుండా గంబూషియా చేపపిల్లలు, ఆయిల్బాల్స్ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటితోపాటు సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కౌన్సిలర్లు, మహిళా సంఘాలు, అధికారుల సహకారంతో ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
వార్డుల వారీగా కార్యక్రమాలు..
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వార్డులవారీగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. వారానికి ఒకరోజు డ్రైడే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కౌన్సిలర్ల సహకారంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుకెళ్తున్నారు. ఇండ్లలో చెత్తను తొలగించడం, ఖాళీ స్థలాల్లో చెత్త వేసే వారికి జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటున్నారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి పట్టణప్రగతి కార్యక్రమం చేపట్టే అవకాశం ఉన్నందున బల్దియా పరిశుభ్రతపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే పట్టణంలోని ఆయా వార్డుల్లో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్, కమిషనర్ పర్యటించి పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు.
పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యం
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం లభిస్తుంది. వార్డుల్లో కౌన్సిలర్లు, అధికారులు పారిశుధ్య పనుల్లో భాగస్వాములు కావాలి. ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు 10నిమిషాలు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో నీటినిల్వలను తొలగించి శుభ్రం చేసుకోవాలి. సమిష్టిగా పనిచేసి పరిశుభ్రత పట్టణంగా తీర్చిదిద్దుకుందాం.