
ఊట్కూర్, జూన్ 27 : రైతుల ఎదురు చూపులు ఎట్టకేలకు ఫలించాయి. వారం, పది రోజులుగా విత్తనాలు వేసుకుని ఆకాశం వైపు వరుణుడి కోసం ఎదురు చూస్తుండగా ఆదివారం వర్షం కురిసింది. జిల్లా అంతటా దాదాపు కురిసింది. ఈ వర్షం పంటలకు ప్రాణం పోసినట్లు అయింది. ఇన్ని రోజులు వరుణుడు దోబూచులాడుతూ ఒక్కో రోజు ఒక మండలంలో వర్షం కురిసినా పక్క గ్రామాల్లో పడకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందారు. వానకాలం సీజన్ ప్రారంభంలో కురిసిన వర్షాలకు కొందరు రైతులు విత్తులు వేసుకున్నారు. మొలకలు రాగా తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో అవి వాడి పోతుండటంతో రైతులు దిగులు చెందారు. ప్రస్తుతం కురిసిన వర్షం వారిలో ఆనందాన్ని నింపింది. జిల్లాలో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నది. వర్షాభావంతో విత్తనాలు మొలకెత్తని రైతులు మరో సారి విత్తనాలు వేసుకోవచ్చు.
ఊపిరిపోసిన వర్షం
వర్షం కురవకపోతుందా అనే ఆశతో రైతులు విత్తనాలు విత్తుకున్నారు. తర్వాత పడకపోవడంతో నిరాశకు లోనయ్యారు. శనివారం రాత్రి, ఆదివారం జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. జిల్లాలో 203 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మాగనూర్‌లో 38. 6 మి.మీ. కురిసింది. మక్తల్ 29..0 మి.మీ., కృష్ణ 27.3 మి.మీ., ధన్వాడలో 19.2 మి.మీ., మరికల్లో 17.0 మి.మీ., మద్దూర్‌లో 16.2 మి.మీ., దామరగిద్దలో 13.4 మి.మీ., ఊట్కూర్‌లో 11.8 మి.మీ., నర్వలో 11.6 మి.మీ., కోస్గిలో 11. 6 మి.మీ., నారాయణపేటలో 7.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆదివారం ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో నేలంతా తడిసి ముద్దయింది. పట్టణ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రైతులు నాటిన పత్తి, కంది, పెసర పంటలకు ఈ వర్షంతో జీవం పోసినట్లయింది. చినుకు రాలక.. ఎండల తీవ్రతకు మొలకెత్తే దశలో ఉన్న పంటలు ఎక్కడ ఎండిపోతాయోనని ఆందోళన చెందిన అన్నదాతల్లో ఈ వర్షం ఆనందం నింపింది. కొద్ది రోజులుగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలు వర్షంతో వాతావరణం చల్లబడగా ఉపశమనం పొందారు.