నారాయణపేటరూరల్, జూన్ 6: నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనల కోసం సోమవారం నారాయణపేటకు వచ్చిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు నారాయణపేట పట్టణ యువకులు పెద్దఎత్తున బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు విజయ్‌సాగర్, ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి, యువత అధ్యక్షుడు గడ్డం వినోద్ బైక్‌ర్యాలీకి నేతృత్వం వహించారు. అదేవిధంగా మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి సైతం పెద్ద ఎత్తున యువకులు బైక్ ర్యాలీతో నారాయణపేటకు చేరుకున్నారు. అదే విధంగా నియోజకవర్గంలోని కోయిల్‌కొండ, ధన్వాడ, మరికల్, దామరగిద్ద, నారాయణపేట పట్టణ, మండలాల నుంచి జనం పెద్దసంఖ్యలో సభకు తరలివచ్చారు. నారాయణపేట మండల నాయకులు వేపూరి రాములు, అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, కోట్ల జగన్మోహన్రెడ్డి, సాయిరెడ్డిలు జనం తరలించడంలో సఫలీకృతులయ్యారు. ముఖ్యంగా మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సభకు అనుకున్నదానికంటే ఎక్కువస్థాయిలో జనం తరలిరావడంతో టీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. స్వచ్ఛందంగా వచ్చిన మహిళలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.