మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 29: తండ్రి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి ఆశపడి, తండ్రిపై స్పిరిట్ పోసి నిప్పంటించి చంపిన కసాయి కొడుక్కి యావజ్జీవ కారాగారశిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ మహబూబ్‌నగర్ జిల్లా ప్రధానన్యాయమూర్తి ప్రేమావతి గురువా రం తీర్పు వెల్లడించారు. జిల్లా సెషన్స్‌కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కెం జనార్దన్ కథనం మేరకు.. మిడ్జిల్ మండలం మాదారం గ్రామానికి చెంది న సత్యనారాయణకు తన తండ్రి జంగయ్య (ప్రభుత్వ ఉద్యోగి) మరణాంతరం పశుసంవర్ధకశాఖలో ఉద్యోగం వచ్చింది. అయితే సత్యనారాయణ కూడా మరణిస్తే ఈ ఉద్యోగం తనకే వస్తుందని అతడి కుమారుడు పట్నం శ్రీనుకు దురాశ కలిగింది.
2016 డిసెంబర్ 10న బైక్ విషయంపై తండ్రి సత్యనారాయణతో శ్రీను గొడవపడ్డాడు. అనంతరం అతడిపై స్పిరిట్ చల్లి నిప్పంటించాడు. కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందిన సత్యనారాయణ.. కల్వకుర్తి ప్రథమశ్రేణి న్యాయమూర్తికి ఇచ్చిన మరణవాంగ్మూలంలో తన కొడుకు తనపై స్పిరీట్ పోసి నిప్పటించాడని పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు పట్నం శ్రీనుపై అప్పటి సీఐ గిరిబాబు దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో పీపీ జ నార్దన్ కోర్టులో 13మంది సాక్షులను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆశపడి ఈ ఘాతకానికి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో నిందితుడు పట్నం శ్రీనుకు యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ తీర్పు చెప్పినట్లు పీపీ తెలిపారు. లైజన్ అధికారులుగా ఎస్సై అరుణ, ఏఎస్సై విష్ణు, లైజన్స్ ఇర్ఫాన్ వ్యవహరించి సాక్షులను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.