మహబూబ్‌నగర్, జూన్ 15 : దళిత బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని మల్టీజోన్-2 ఐజీ సుధీర్‌బాబు అభినందించి సన్మానించారు. శనివారం జిల్లా పర్యటనలో భాగంగా డీఐజీ కార్యాలయానికి ఐజీ రాగా ఉమ్మడి జిల్లా డీఐజీ ఎల్ఎస్ చౌహాన్‌తో పాటు ఎస్పీ, జిల్లా పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ నేరాలపై నిరంతరం నిఘా పెంచాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బోయపల్లి వద్ద జరిగిన దళిత బాలికపై లైంగిక వేధింపుల కేసు విషయమై ఆరా తీశారు. నిందితుడు గోదా మల్లేశ్ నడుపుతున్న క్లినిక్‌కు కడుపునొప్పితో వచ్చిన బాలికపై 2016 ఫిబ్రవరి 4న లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అప్పటి ఎస్సై జి.రాజేశ్వర్‌గౌడ్‌కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ కృష్ణమూర్తి విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. అనంతరం నేరపరిశోధన చేసి అభియోగపత్రాలను సమర్పించి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాద, ప్రతివాదనల అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక చట్టం ద్వారా యావజ్జీవ శిక్షతోపాటు రూ.8వేల జరిమానా, లైంగికదాడి కేసులో మరో పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వి.శారదాదేవి శుక్రవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసులో విచారణ జరిపిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్సీ, ఎస్టీ కోర్టు రాంబాక్ష, అప్పటి డీఎస్పీ కృష్ణమూర్తి, ప్రస్తుత డీఎస్పీ వెంకటేశ్వర్లు, పీసీ నెంబర్ 141 అశోక్‌రెడ్డి, రూరల్ పీఎస్ హోంగార్డు 154 సురేశ్‌కుమార్‌ను ఐజీ సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములు, సిబ్బంది పాల్గొన్నారు.