అమరచింత : నాగర్‌కర్నూలు జిల్లా అమరచింత పట్టణంలోని రజక వీధిలో నివాసం ఉంటున్న లాండ్రీ షాప్ యజమాని (Laundry owner) చాకలి బాబు తన నిజాయితీని చాటుకున్నాడు. బట్టలు ఉతకడానికి ఇచ్చిన ప్యాంట్ జేబులో రూ. 28వేల నగదు కనిపించడంతో తిరిగి వాటిని కస్టమర్‌కు అప్పగించాడు. గురువారం పట్టణంలోని శివాజీ నగర్ లో నివాసం ఉంటున్న బాగుండ్ల గోపి అనే వ్యక్తి చాకలి బాబుకు దుస్తులను ఉతికేందుకు ఇచ్చాడు.
బట్టలను ఉతుకుతుండగా ప్యాంటు జేబులో రూ. 28 వేల నగదు కనిపించడంతో అప్రమత్తమై గౌండ్ల గోపి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు తాటికొండ రమేష్, రజక సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు చాకలి సత్యనారాయణ పలువురు కాలనీవాసులు చాకలి బాబు నిజాయితీని అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి కాలంలో వంద రూపాయలు కనిపిస్తే తిరిగే ఇచ్చేవారు లేరని , అలాంటి సందర్భంలో లాండ్రీ షాప్ చాకలి బాబు రూ. 28 వేల నగదును అందజేసి తన నిజాయితీ చాటుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.