నారాయణపేట రూరల్, ఆగస్టు 11 : సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గానికి సాగునీటిని అందించేందుకు చేపట్టిన పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించేంత వరకు పోరాటం ఆగదని భూ నిర్వాసితులు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారంతో రైతులకు ఒక్క ప్లాటు కూడా వచ్చే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండలంలోని సింగారం, పేరపల్ల తదితర గ్రామాలకు చెందిన వంద మంది రైతులు పాదయాత్రగా తాసీల్దార్ కార్యాలయానికి చేరుకోగా కొంత మంది రైతులు ఎడ్లబండ్లతో ర్యాలీగా వచ్చి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం తాసీల్దార్‌కు వివిధ డిమాండ్స్‌తో కూడిన వినతిపత్రాన్ని భూ నిర్వాసితులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ నాయకుడు అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి హాజరై రైతుల కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేట-కొడంగల్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం అందించాలన్నారు. ప్రభుత్వం రైతులను భయభ్రాంతులకు గురి చేసి రైతులను భూములను లాక్కొంటే సహించేది లేదని హెచ్చరించారు. పార్టీలు పదవులు ఈరోజు ఉంటాయి రేపు పోతాయని రైతులు పంట పండించాల్సిందేనని అన్నారు. విలువైన భూములను కోల్పోతున్న రైతాంగానికి ప్రభుత్వం ఎకరాకు రూ.50 నుంచి 70 లక్షల వరకు పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.
రైతులకు న్యాయం జరిగేంతవరకు రైతుల వెంబడి ఉండి పోరాటం చేస్తామని, ఇక్కడ ఎవరూ రా జకీయాలు చేయడం లేదని రైతులకు న్యాయం చేయమని కో రుతున్నామన్నారు. రైతు కన్నీటికీ కారణమైన ఏ ప్రభుత్వం బాగుపడిన దాఖలాలు లేవని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యే సీఎం పీఠాన్ని ఎక్కిస్తే, రేవంత్‌రెడ్డి తన స్వలాభం కోసం రైతులను నిలువునా మోసం చేసేందుకు పూ నుకోవడం దుర్మార్గం అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి రైతులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం నాయకులు మశ్చేందర్, వెంకట్రామిరెడ్డి, గోపాల్, వివిధ పార్టీల నాయకులు వేపూరి రాములు, బలరాం, కాశీనాథ్,ఆంజనేయులుతోపాటు భూ నిర్వాసితులు పాల్గొన్నారు.