మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న జడ్చర్ల పట్టణంలో నిర్వహించే భారీ బ హిరంగసభలో ఆయన పాల్గొంటారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఇటీవలే కేటీఆర్‌ను కలిసి జడ్చర్లలో నిర్వహించే భారీ బహిరంగకు తరలిరావాలని కోరారు. ఈ మేరకు తొమ్మిదవ తేదీన జరిగే కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరుకానున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్ల నియోజకవర్గం కీలకమైంది. అంతేకాకుండా ఈనెల 13న గద్వాల జిల్లా కేంద్రంలో జరిగే పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి కూడా కేటీఆర్ హాజరుకారున్నారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి.. పార్టీ ఫి రాయింపుల చట్టం కింద స్పీకర్ నోటీసు ఇవ్వడంతో.. ఇక్కడ ఉప ఎన్నికలు ఖా యంగా కనిపిస్తున్నాయి. అయితే తాను పార్టీ మారలేదని బీఆర్ఎస్లోనే ఉన్నానని ఇటీవల బండ్ల ప్రకటించడంతో పార్టీ నుంచి గెలిచి పార్టీకి వెన్నుపోటు పొడిచిన బండ్ల భాగవతాన్ని బయట పెట్టేందుకు కేటీఆర్ గద్వాలకు వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనేకమంది బండ్ల అనుచరులు.. పార్టీలోకి వస్తుండడంతో గద్వాలలో రాజకీయం రసకందాయంగా మారింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో రెండు చోట్ల కేటీఆర్ పర్యటనలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోవడంతో పా టు హాట్ టాపిక్‌గా మారాయి.