మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి) /చిన్నంబావి/కొల్లాపూర్, మార్చి 6 : కృష్ణా తీరంలో ఆంధ్రా జాలర్లు రెచ్చిపోతున్నారు. నిషేధిత అలివి వలలతో యథేచ్ఛగా చేపల వేట కొనసాగిస్తున్నారు. నదీ ఒడ్డున మకాం వేసి ఇక్కడి విలువైన మత్స్య సంపదను అక్రమంగా దోచుకెళ్తున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని తీరప్రాంతంలోని పల్లెలైన చిన్నంబావి మండలం మొదలు.. జటప్రోల్, మంచాలకట్ట, సోమశిల, అమరగిరి, కోతిగుండు, చీమలతిప్ప వరకు అక్రమ వేట కొనసాగిస్తున్నారు. నదీ ఒడ్డున తాత్కాలిక షెడ్లు, గుడారాలు ఏర్పాటు చేసుకొని వారి కార్యకలాపాలను జోరుగా సాగిస్తున్నారు. దీంతో వలల ద్వారా చిన్న చేపపిల్లల(గుడ్డు)ను సైతం వదలకుండా వేటాడుతున్నారు. ఇక్కడి చేపలను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, వారికి ముడుపులు ముట్టడమే కారణమన్న ఆరోపణలు లేకపోలేదు. అలివి వలలతో వేట కొనసాగిస్తున్నారని స్థానిక మత్స్యకారులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినా లాభం లేకపోతుంది. దీంతో వారి వేటను ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’గా కొనసాగిస్తున్నారు.
గలగల పారే కృష్ణమ్మ ఒడిలోని మత్స్య సంపదను కొందరు దళారులు దోచేస్తున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఫిషింగ్ మాఫియా తీరా ప్రాంతాల్లో తిష్టవేశారు. ప్రభుత్వ జాగాలను దర్జాగా కబ్జా చేసి రూ.కోట్ల మత్స్య సంపదను కొల్లగొడుతున్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కోల్‌కత ప్రాంత వాసులను కాపలా ఉంచి అక్రమ రవాణాకు తెర లేపారు. నదీ తీరంలో ఏటా వందల కోట్ల వ్యాపారం జరుగుతున్నా.. ప్రభుత్వానికి నయాపైసా ఆదాయం కూడా రాదు. ఆంధ్రా జాలర్లకు వత్తాసు పలుకుతూ.. స్థానిక మత్స్యకారుల కడుపుకొడుతూ.. అధికారులు రూ.లక్షలు పోగేసుకుంటున్నారు. పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారుల తీరుతో స్థానిక జాలర్లు పట్టిన చేపలను స్థానిక మార్కెట్లో విక్రయిస్తూ బతుకుజీవుడా అని జీవిస్తున్నారు.
కళ్ల ముందే తమ సంపదను దోచుకుంటున్న ఈ ఫిషింగ్ మాఫియాను ఎదిరించే ధైర్యం ఎవరూ చేయడం లేదు. సాక్షాత్తు మంత్రి జూపల్లి సొంత నియోజకవర్గంలో మాఫియా రెచ్చిపోతున్నది. నిషేధిత అలివి వలలను వాడుతూ నదీ మొత్తాన్ని కబ్జాచేసి మత్స్య సంపదను దోచుకుంటున్నా పట్టింపు కరువైంది. చివరకు ప్రభుత్వాలు స్థానిక మత్స్యకారులకు ఇచ్చే అన్ని రకాల సబ్సిడీలను సైతం ఈ మాఫియా పథకం ప్రకారం లాగేసుకుంటుందన్న ఆరోపణలు ఉ న్నాయి. కృష్ణానదిలో మత్స్యసంపదపై హక్కున్న స్థానిక మత్స్యకారుల ఆవేదన ప్ర భుత్వానికి పట్టడం లేదు. ఈ ప్రాంత ంలో నాయకులకు, అధికారుల దావతులకు.. ఆంధ్రా జాలర్లు పంపించే బొచ్చ చేపలకు నోళ్లుకు ట్టేసుకుంటున్నట్లు తెలిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొ ల్లాపూర్ నియోజకవర్గంలోని నదిలో కొనసాగే చేపల దందా పై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి పెంట్లవెల్లి, కొల్లాపూర్ తదితర మండలాల్లోని కృష్ణానది తీర ప్రాంతం ఆంధ్రా జాలర్ల గుప్పిట్లో నలుగుతున్నది. ఇటు పోలీసు.. అటు రెవెన్యూ.. మత్స్య శాఖ ఉన్నతాధికారుల అండదండలతో చేపల వేట కొనసాగుతున్నదన్న ఆరోపణలు లేకపోలేదు. నిషేధిత అలివి వలలను విచ్చలవిడిగా వాడి నదిలో దొరికే అరుదైన చేపల్ని వేటాడుతున్నారు. తీర ప్రాంతం మొత్తం వీరి గుప్పిట్లో నలిగిపోతున్నది. ఈ వలలకు చేపలు పెట్టే గుడ్లు.. సెంటీమీటర్లు కూడా పెరగని చేపలు చిక్కుకుంటున్నాయి. ఫలితంగా పెద్ద చేపల కన్నా అలివి వలలకు చిక్కే చిన్న చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో విచ్చలవిడిగా వేట కొనసాగిస్తున్నారు.
కొల్లాపూర్ సమీపంలోని సోమశిల, అమరగిరి, మల్లేశ్వరం, చీమల తీప్ప, మంచాలకట్టతోపాటు శ్రీశైలం బ్యాక్ వాటర్ తగ్గే కొద్దీ అలివి వలలు క్యాంప్‌లు ఏర్పాటు చేస్తారు. కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చిన్నంబావి(వనపర్తి జిల్లా) మండలం వెల్టూరు, చెల్లపాడు, కాలూరు, గూడెం గ్రామాలలో ఆంధ్రా జాలర్లు స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని స్థానిక మత్స్యకారుల కడుపు కొడుతున్నారు. నదిలో విచ్చలవిడిగా నిషేధిత అలివి వలల పాయింట్లు ఏర్పాటు చేసుకుని నదిలో రాత్రింబవళ్లు వేట కొనసాగిస్తున్నారు.
ఈ అలివి వలలకు ముఖ్యంగా బేర్షలు, బట్టగెండె, పొట్టు చేపలు, మోసు, కట్ల, రోహు, మృగాల, సన్నరొయ్య వంటి ప్రధాన రకాల చిన్నచిన్న పిల్లలు చిక్కుతాయి. వీటి ధర మార్కెట్లో కేజీకి రూ.300 నుంచి రూ.500 వరకు పలుకుతంది. ఈ చేపల నుంచి ఔషధాలు, కాస్మోటిక్స్ తయారవుతాయి. వ్యర్థాలను కోళ్ల దాణాకు ఉపయోగిస్తున్నారని సమాచారం. ఇలా పట్టిన చేపలను కర్నూలు, హైదరాబాద్‌కు తరలించి అక్కడి నుంచి ఇతర రాష్ర్టాలైన కేరళ, తమిళనాడు, కోల్‌కతతోపాటు ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నట్లు తెలిసింది. చిన్న చేపల ప్రయోజనాలు పెద్దగా ఉండడంతో అలివి వలలతో యథేచ్ఛగా వేటాడుతున్నారు.
కృష్ణానది తీర ప్రాంతం వివిధ రకాల మత్స్య సంపదకు పెట్టింది పేరు. ఏడాది పొడవునా శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసినప్పుడు అక్కడి నుంచి అరుదైన చేపలు కొట్టుకొస్తాయి. కొన్ని రకాల చేపలు అలా వచ్చి ఇక్కడే ఆయా జాతి చేపపిల్లల ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా రిజర్వాయర్లలో కోట్లాది చేప పిల్లలను వదులుతున్నది. ఈ చేప పిల్లలను ఇక్కడి నుంచి తరలి ఆంధ్రాలో పెంచి మళ్లీ తిరిగి ఇక్కడికే వస్తాయి. ఇదంతా మాఫియా చూసుకుంటుంది. దీంతో స్థానిక మత్స్యకారులకు కృష్ణానదిపై పట్టు సడలిపోయింది.
వైజాగ్, గుంటూరు, నెల్లూరు నుంచి వచ్చిన ఆంధ్రా జాలర్లు ఇక్కడ స్థిరపడి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. స్థానిక మత్స్యకారులను దగ్గరికి రానివ్వడం లేదు. సొంతంగా బోట్లు తయారు చేసుకొని రాత్రింబవళ్లు షిఫ్టుల వారీ గా చేపలవేట కొనసాగిస్తున్నారు. అయితే స్థానిక మ త్స్యకారులకు వీళ్లే పట్టిన చేపలను కిలోల లెక్కన అమ్మిపోతారు. దీంతో కొంతమంది మార్కెట్లలో అమ్ముకొని జీవనం సాగించుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో కూర్చుంటే అమ్మగా వచ్చిన మిగిలిన లాభాన్ని కుటుంబ పోషణకు ఉపయోగించాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు.
కొల్లాపూర్ తీరా ప్రాంతంలో తిష్టవేసిన ఫిషింగ్ మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతున్నది. స్థానిక పోలీస్, రెవెన్యూ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తీర ప్రాంతాల్లోని ప్రభుత్వ జాగాల్లో చిన్నచిన్న గుడిసెలు వేసుకొని వేటాడిన చేపల్ని అక్కడే నిల్వ చేసుకొని రాత్రికిరాత్రి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ స్థలాలన్నీ ప్రభుత్వ జాగాలు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా.. అక్రమంగా నివాసం ఉంటున్నారు. స్థానిక మత్స్యకారులను దరిదాపుల్లోకి రానీయకుండా నదిలో యథేచ్ఛగా చేపల వేట కొనసాగిస్తూ ఏడాది పొడవునా కోట్ల రూపాయాలు గడిస్తున్నారు. ఈ మూడు శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు అందిస్తూ.. నాయకుల పార్టీలకు చేపలు గిఫ్టుగా పంపుతున్నట్లు సమాచారం.
కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ (ఏటీఆర్ఎఫ్) ఉంటుంది. కృష్ణానది చుట్టుపక్కల ప్రాంతాల్లో పులుల సంచారం ఎక్కువ. అటవీశాఖ సిబ్బంది కూడా మైనింగ్ మాఫియాకు దాసోహం అయింది. ఫలితంగా చేపల వేటను టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో కూడా యథేచ్ఛగా ఆంధ్రా మాఫియా కొనసాగిస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పులుల సంచారం తీర ప్రాంతాలకు తగ్గిపోయింది. ఎండాకాలంలో దాహార్తి తీర్చుకోవడానికి రావడమే మానేశాయి. దీంతో ఫారెస్ట్‌లోనే నీటినిల్వలు తగ్గిపోయి దాహార్తితో ఎండాకాలంలో అలమటిస్తున్నాయి.
ఏటీఆర్ఎఫ్లోకి అందరికీ నిషేధం ఉన్నా.. ఈ ఫిషింగ్ మాఫియా మాత్రం దట్టమైన అడవిలోని నదీ తీర ప్రాంతంలో యథేచ్ఛగా చేపల వేట కొనసాగిస్తున్నారు. వీరికి అటవీ శాఖ పరోక్షంగా సహకరిస్తుందని ఆరోపణలు లేకపోలేదు. మరోవైపు నదిలో ద్వీపకల్పంగా.. పర్యాటక ప్రాంతంగా మార్చాల్సిన చీమలతిప్ప ప్రాంతాన్ని వైజాగ్‌కు చెందిన జాలర్లు కబ్జా చేసేశారు. ఇక్కడికి ఎవరినీ రానీవ్వడం లేదు. ఎండా కాలంలో నీటి నిల్వలు తగ్గినా వీరి వేటకు మాత్రం ఇక్కడ ఢోకాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి నదీ తీరంలో అలివి వలల వేటను అడ్డుకొని.. స్థానిక మత్స్యకారులకు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.