MGKLI | కొల్లాపూర్ : కొల్లాపూర్ మండలం రేగుమానుగడ్డ వద్ద మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎంజికేఎల్ఐ నుంచి గుట్టు చప్పుడు కాకుండా అధికార సమాచారం లేకుండా సాగు నీటిని విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే ఎంజికేఎల్ఐ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందని తెలిసి 13000 ఎకరాల నుంచి నాలుగు లక్షల అరవై వేల ఎకరాల వరకు సాగును పెంచిన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నించారు. ఐదు మోటర్లలో రెండు మోటర్లు పని చేయకపోవడానికి గల కారణం కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రధాన కారణం. అప్పుడు ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి కూడా జూపల్లి కృష్ణారావు కావడం విశేషం. ఎంజికేఎల్ఐ ప్రధాన కాలువ తక్కువ వెడల్పు తక్కువ ఎత్తు ఉండడంతో రెండు మోటర్లు ఆన్ చేస్తేనే కాలువ తెగిపోయే పరిస్థితి వస్తుంది. జూన్ నెలలో కృష్ణా నదికి వరద వస్తే నేటి వరకు ఎంజికేఎల్ఐ మంచి సాగునీరు విడుదల చేయకపోవడానికి గల కారణాలను మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పి ఉంటే బాగుండేదని రైతులు చర్చించుకుంటున్నారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మోటర్లు ఆన్ చేయకపోతే దండయాత్ర చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించడంతో అధికార సమాచారంతో నిమిత్తం లేకుండా హడావిడిగా ఇరిగేషన్ అధికారులను వెంటబెట్టుకుని ఎంజికేఎల్ఐ నుంచి సాగు నీరు విడుదల చేశారు. మిగిలిన ప్రాజెక్టులను నుంచి కూడా సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
సాగునీరు విడుదల చేయడంలో ఆలస్యం చేసింది : మీనిగ సత్యం
మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఒక పది రోజులు ముందు కాల్వకు నీళ్లను విడుదల చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు వరి నాట్లు ఒక పది రోజులు వెనుకబడతాయి. ముందుగా పంట దిగుబడి వస్తే మార్కెట్లో కూడా డిమాండ్ ఉండేది.
నీళ్లు ఉన్న విడుదల చేయలేదు.
సింగోటం రిజర్వాయర్ కింద సాగు ఆలస్యం : చింతకుంట శ్రీనివాసులు సింగిల్ విండో చైర్మన్
కృష్ణా నదికి వరద నెలరోజుల ముందు వచ్చిన ఎంజికేఎల్ఐ నుంచి సాగు నీరు విడుదల చేయకపోవడంతో రిజర్వాయర్‌కు నీళ్లు చేరలేదు. దీంతో సింగోటం రిజర్వాయర్ కింద సాగు ఆలస్యమైంది. ఎంజికేఎల్ఐ నుంచి హడావిడిగా సాగునీరు విడుదల చేసి గొప్పలు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నెలరోజు ముందు కృష్ణా నదికి వరద వచ్చిన నీళ్లను ఎందుకు లిఫ్ట్ చేయలేదో సమాధానం చెప్పాలి. ఈ ప్రాంతానికి చెందిన మంత్రి కూడా బాధ్యత వహించాలి. శ్రీశైలం గేట్లు ఎత్తిన తర్వాత ఎంజి కేఎల్ఐ నుంచి నీళ్లను లిఫ్ట్ చేయడం సిగ్గుచేటు.