మహబూబ్‌నగర్, జనవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఎగువ పాలమూరుతోపాటు ప్రాజెక్టుల కోసం త్యాగం చేసిన కొల్లాపూర్ ప్రాంతం ఎడారిగా మారే పరిస్థితి నెలకొన్నది. ‘వడ్డించేవాడు మన వాడు అయితే.. అఖరి బంతిలో కూర్చొన్న న్యాయం జరుగుతోంది’.. అని పాలమూరు వాసులు భావించారు. కానీ మహబూబ్‌నగర్ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వైఫల్యంతో కళ్ల ముందు నీళ్లు ఉన్నా రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. డిండికి పాలమూరు నీళ్లను ఎదుల రిజర్వాయర్ నుంచి తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు చర్చ జోరందుకున్నది. దీంతో ఉమ్మడి జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాను పూర్తిగా సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేపట్టింది. వలసలకు కేరాఫ్‌గా ఉన్న పాలమూరులో జలసిరులు కురిపించాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎత్తిపోతల పనులను చేపట్టింది. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ వద్ద లిఫ్టులను ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల 90 శాతం.. మరికొన్ని చోట్ల 95 శాతం పనులు తక్కువ కాలంలోనే పూర్తయ్యాయి.
2023 సెప్టెంబర్ 16న మొదటి రిజర్వాయర్‌లోకి నీటి పంపింగ్‌ను నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తర్వాత పంపింగ్ కొనసాగడంతో 1/3 కృష్ణానీటిని ఎత్తిపోశారు. దీంతో నార్లాపూర్ రిజర్వాయర్‌కు జలకళ సంతరించుకున్నది. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో అసెంబ్లీ ఎన్నికలు రావడం.. తర్వాత కాంగ్రెస్ అధికారంలో కి రావడంతో పాలమూరు లిఫ్ట్‌పై వివక్ష చూపారు. దీంతో ‘పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా తయారయ్యాయి.
పాలమూరు లిఫ్ట్‌లో మిగిలిన పనులను పూర్తి చేస్తే ఎగువన ఉన్న రిజర్వాయర్లల్లోకి నీటిని పంపింగ్ చేసే అవకాశం ఉండేది. తద్వారా ఉమ్మడి జిల్లాలోని రైతులకు పుష్కలంగా సాగునీళ్లను కూడా అందేవి. కానీ రేవంత్ సర్కారు ఏర్పాటై ఏడాది గడిచినా పనులు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కావాలనే వివక్ష చూపుతూ పనులు చేపట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
కొల్లాపూర్ మండలం కుడికిళ్ల, పెద్దకొత్తపల్లి మండలం తీర్మానంపల్లి గ్రామాల మధ్య ప్రాజెక్టు ప్రధాన కాల్వ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో నీళ్లు పారడం లేదు.. ఎగువ ప్రాంతానికి లిఫ్ట్ చేసే అవకాశం లేకుండాపోయింది. దీనికితోడు ఇక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వం యోచిస్తున్నదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎదుల లిఫ్ట్ నుంచి డిండికి నీళ్లను తరలించేందుకు ఉన్న శ్రద్ధ ఎగువ పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించడం లేదని కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంత వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నా సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలన్న సోయి లేదంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం ఎండాకాలంలో సాగు, తాగునీటికి కష్టాలు ఏర్పడే అవకాశం ఉన్నది. 120 టీఎంసీలతో పాలమూరు జిల్లాలో దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరు, పరిశ్రమలకు నీటిని అందించడంతోపాటు తాగునీటి అవసరాలను తీర్చేందుకు పీఆర్ఎల్ఐ మొదటి ప్రాధాన్యతగా పనులు కొనసాగాయి. ఈ క్రమంలోనే గతేడాది మూడోవంతు నీళ్లను నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేశారు. నిబంధనల ప్రకారం ఈ ఏడాది కూడా మరో 1/3 నీటిని పంపింగ్ చేయాలి..
కానీ ప్రభుత్వం శ్రీశైలం ఖాళీ అవుతున్నా ఈ ఏడాది ఇప్పటి వరకు నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి చుక్క నీటిని పంపింగ్ చేయలేదు. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఎంజీకేఎల్‌ఐకి శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం లేకుండా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం పీఆర్ఎల్ఐ మొదటి రిజర్వాయర్ ద్వారా ఎంజీకేఎల్‌ఐకి సాగునీరు అందించేందుకు పనులను పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్ సర్కారు ప్రాజెక్టు నిర్మాణంలో భూములు త్యాగం చేసిన ప్రాంతానికి సాగునీరు అందించకుండా ఎసరు పెట్టేందుకు సిద్ధమైందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్యంగా కొల్లాపూ ర్ రైతులు భూము లు అందించారు. ఇక్కడి రైతులకు పీఆర్ఎల్ఐ కేటాయింపులు లేకున్నా తాను ప్రత్యేక చొరవతో అప్పటి ముఖ్యమ ంత్రితో మాట్లాడి మొదటి రిజర్వాయర్ ద్వారా ఎంజీకేఎల్‌ఐకి నీటి కేటాయింపులు చేపట్టేలా చూశాం. కానీ ఇప్పటి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో చుక్క నీటిని కూడా మొదటి రిజర్వాయర్‌లోకి పం పింగ్ చేయలేదు.. సరికదా డిండికి పాలమూరు నీటిని తరలించే కుట్ర చేస్తున్నారు. కూత వేటు దూరంలో కృష్ణానది ఉన్నా సాగునీరు అందని కొల్లాపూర్ పరిసర ప్రాంతాలకు నీళ్లిచ్చేలా జీల్దార్తిప్ప, వీరనాయిని చెరువులకు నదీ జలాలను తరలింపుపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలి. లేకుంటే ప్రజలు, రైతుల దృష్టిలో చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయం.
– బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే