మూసాపేట(అడ్డాకుల), మార్చి 8 : మండలంలోని కందూరు రామలింగేశ్వరస్వామి రథోత్సవ వేడుక బుధవారం వైభవంగా సాగింది. రామలింగేశ్వరస్వామి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని మంగళవారం రాత్రి నుంచే ప్రారంభించారు. ప్రత్యేక పూజలు చేయడంతోపాటు హోమాలు, కుంభాభిషేకం నిర్వహించారు. చిన్నారులు, యువకులు, బాలికలు చిడుతల భజనలతో అలరించారు. మహిళలు బొడ్డెమ్మలు వేస్తూ ఆడిపాడారు. యువకులు, పెద్దలు కలిసి కోలాటాలు ఆడారు. భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా బుధవారం తెల్లవారుజామున రథోత్సవం సాగింది. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం పంచాక్షరి మం త్రంతో మార్మోగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రమేశ్‌గౌడ్, సర్పంచ్ శ్రీకాంత్, వివిధ పార్టీల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
పాలమూరు, మార్చి 8 : పేదల తిరుపతిగా పేరొందిన మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుసంధానమైన అలివేలు మంగతాయారు అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారు జామున రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల కోలాహలం మధ్య రథాన్ని భక్తులు లాగారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనంతో పరవశించిపోయారు. సాయంత్రం అమ్మవారికి అశ్వవాహన సేవ కనులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, పర్యవేక్షకులు నిత్యానందచారి, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.