కొల్లాపూర్ రాజకీయ సమీకరణం మారింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో బీఆర్ఎస్ వేటు వేసింది. గతంలో సీఎం కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టి సముచిత స్థానం కల్పించారు. ప్రతిసారి ఏదో సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకొని గెలిచిన ఆయన పాచిక 2018 ఎన్నికల్లో పారలేదు. ఆయన తీరుతో నియోజకవర్గ ఓటర్లు ఓటమి రుచిచూపారు. దీంతో ఖంగుతిన్న మాజీ మంత్రి బీఆర్ఎస్లో ఉంటూనే రాజకీయ డ్రామాకు తెరతీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టినా అధిష్టానం క్షమించింది. స్థానిక ప్రజాప్రతినిధులను దామాషా పద్ధతిలో పంచుకొని తనవైపునకు తిప్పుకొని ప్రగతికి ఆటంకం కలిగించినా సహించింది. ఆత్మీయ సమ్మేళ నాలంటూ పార్టీని చీల్చే ప్రయత్నం చేసినా భరించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా బుజ్జగించినా దిగిరాలేదు. ఆదివారం కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంతో చివరకు దండన పడింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం వెల్లడించింది. దీంతో బీరం హర్షవర్ధన్‌రెడ్డికి లైన్ క్లియరై వార్ వన్‌సైడ్ కాగా.. జూపల్లిని బహిష్కృతం చేయడంతో పార్టీశ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
– మహబూబ్‌నగర్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి పాలమూరులో అవకాశవాద రాజకీయాలకు బీఆర్ఎస్ చెక్ పెట్టింది. పార్టీలో ఉంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ మంత్రి జూపల్లిని పార్టీ సస్పెండ్ చేసింది. పదవులు అనుభవించి.. ప్రజలకు చేరువ కాలేక ఎన్నికల్లో ఓడిపోయి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టినా పార్టీ ఓపిక పట్టింది. స్థానిక ప్రజాప్రతినిధులను దామాషా పద్ధతిలో పంచుకొని తనవైపుకు తిప్పుకొని అభివృద్ధికి ఆటంకం కల్పించినా భరించింది. ఆత్మీయ సమ్మేళనాలంటూ పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నా సహించింది. స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బుజ్జగించినా దిగిరాని జూపల్లికి బీఆర్ఎస్ పార్టీ తగిన గుణపాఠం చెప్పింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావును సోమవారం బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో కొల్లాపూర్ నియోజకవకర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే, అభివృద్ధికి ఆకర్షితులై వచ్చిన బీరం హర్షవర్దన్‌రెడ్డికి లైన్ క్లియరైంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ ధైర్యంగా చర్య తీసుకోవడంతో కొల్లాపూర్ రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. జూపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీనేతలు స్వాగతిస్తున్నారు. మంత్రి పదవులు అనుభవించి పార్టీలో సముచిత స్థానం పొందినా.. తల్లిలాంటి పార్టీని విమర్శిస్తారా? అంటూ నాయకులు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ప్రతిసారి ఏదో సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకొని గెలిచిన జూపల్లి పాచిక .. 2018 ఎన్నికల్లో పారలేదు. తనను ఎవరూ ఓడించలేరనే ధీమాతో ఉన్న జూపల్లికి బీరం ఓటమి రుచి చూపించారు. దీంతో ఖంగుతిన్న ఆయన బీఆర్ఎస్లో ఉంటూనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడగా అధిష్టానం చెక్ పెట్టింది. కాగా కొల్లాపూర్‌లో వార్ వన్‌సైడ్ అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బీరానికి లైన్ క్లియర్
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియెజకవర్గంలో పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్న మాజీ మంత్రి జుపల్లిని బీఆర్ఎస్ నుంచి బహిష్కరించడంతో పార్టీ నేతలు సంబరపడుతున్నారు. పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఇద్దరు నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. తమ నాయకుడిని మళ్లీ అందలం ఎక్కిస్తారనుకున్న ఆయన అనుచరులు ఈ నిర్ణయంతో ఖంగుతిని హైదరాబాద్‌లోనే మకాం వేశారు. కాగా కొల్లాపూర్ రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న బీరానికి అడ్డంకి తొలగిపోయింది. ఇక వచ్చే ఎన్నికల్లో తమ నేతకు లైన్ క్లియర్ కావడంతో ఆయన అనుచరులు సంబరపడిపోతున్నారు.
కొల్లాపూర్ అభివృద్ధిలో బీరం మార్కు
2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియెజకవర్గాలను బీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేస్తుందని అనుకోగా కొల్లాపూర్ కాంగ్రెస్ చేతికి చిక్కింది. తనకు ఎదురేలేదనుకున్న తరుణంలో మంత్రి హోదాలో ఉన్న జూపల్లిని ఓడించారు. ఈక్రమంలో అక్కడ హర్షవర్ధ్దన్‌రెడ్డి గెలిచి సంచలనం సృష్టించారు. ఆ తర్వత కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరిన బీరం.. అప్పటినుంచి నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన శైలితో దూసుకుపోతున్నారు. ఇది జీర్ణించుకోలేని జూపల్లి పార్టీలో ఉంటూనే మున్సిపల్ ఎన్నికల్లో తన మద్దతుదారులను నిలబెట్టారు. స్థానికసంస్థల ఎన్నికల్లోనూ ఇలాగే చేస్తే.. మంత్రి నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకొని అరవైశాతం సీట్లు బీరానికి, నలభైశాతం సీట్లు జూపల్లి వర్గానికి ఇచ్చి సయోధ్య కుదిరించారు.
అయినా జూపల్లి మాత్రం పార్టీకి వ్యతిరేకంగా సమావేశాలు, సభలు పెట్టారు. కొల్లాపూర్‌కు వచ్చిన మంత్రి కేటీఆర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కలిసినా మార్పు రాలేదు. పార్టీలో ఉంటూ వ్యతిరేకవర్గంతో ఆత్మీయ సమ్మేళనాలు చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ తరుణంలో కొల్లాపూర్‌లో ఎన్నడూ లేనంత అభివృద్ధిని చేసి చూపించడంతో కార్యకర్తలు, నేతలు బీరం దారిలో వచ్చి చేరారు. కాగా అధికారం అడ్డంపెట్టుకొని జూపల్లి చేసిన నిర్వాకాలే అతడికి చెక్ పెట్టాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. చివరకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు శృతి మించడంతో అతడిని పార్టీ నుంచి బహిష్కరించగా.. ఇక కొల్లాపూర్‌లో బీఆర్ఎస్కు ఏదురేలేదని పలువురు అంటున్నారు.