జడ్చర్లటౌన్, మార్చి 14 : తెలంగా ణ బొటానికల్ గార్డెన్, స్టేట్ హెర్బేరియం వంటి అంశాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన జడ్చర్ల డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల.. న్యాక్ ‘ఏ’ ప్లస్‌ప్లస్ గ్రేడ్ కోసం ముస్తాబవుతున్నది. ఈ కళాశాలకు 2017లో బీ ప్లస్‌ప్లస్ గ్రేడ్ గుర్తింపు లభించింది. ఇప్పుడు ‘ఏ’ప్లస్‌ప్లస్ గ్రేడ్ కోసం ఎదురుచూస్తున్నది. న్యాక్ బృందం రెండు రోజులపాటు పర్యటించనున్న నేపథ్యంలో కళాశాలను సర్వం సిద్ధం చేశారు. జడ్చర్లలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేకతను చాటుతున్నది. విభిన్న కోర్సులు, అన్ని వసతులతో నాణ్యమైన విద్యాబోధనలు కొనసాగుతున్న ఈ కళాశాలలో అభ్యసించేందుకు వివిధ ప్రాం తాల విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నతస్థానాల్లో ఉన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు వివిధ రంగాల్లో అవగాహన కల్పిస్తున్నారు.
స్టేట్ హెర్బేరియంకు అంతర్జాతీయ గుర్తింపు..
దేశంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో.. ఏకైక తెలంగాణ స్టేట్ హెర్బేరియం సెంటర్ బీఆర్ఆర్ కళాశాలలోనే ఉన్నది. 2021లో ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ హెర్బేరియం సెంటర్లో 2,250 అరుదైన మొక్కలను భద్రపరిచారు. ఈ హెర్బేరియం సెంటర్‌కు అంతర్జాతీయ స్థాయిలో న్యూయార్క్ సంస్థ టీబీజీహెచ్గా గుర్తింపునిచ్చింది. జీవ వైవిద్య పరిశోధన కోసం ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడుతున్నది.అలాగే 2018లో పాముల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ రకాల పాములను సేకరించి ఇక్కడ భద్రపరుస్తున్నారు. ఇప్పటి వరకు 487 రిస్కీ పాములను సంరక్షించారు. కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కళాశాలలో అవసరమైన సదుపాయాల కల్పనకు ఈ సంఘం సహకారాన్ని అందిస్తున్నది. పూర్వ విద్యార్థుల సహకారంతో న్యాక్ ‘ఏ’ ప్లస్‌ప్లస్ గ్రేడ్ కోసం అధ్యాపకులు కృషి చేస్తున్నారు.
కళాశాల ప్రత్యేకతలు..
దాదాపు 15.17 ఎకరాల విస్తీర్ణంలో కళాశాల ఆధునాతన భవనం ఉన్నది. విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తున్నారు. విశాలమైన తరగతి గదులు, సెమినార్ హాల్ ఏర్పాటు చేశారు. కంప్యూటర్ కోర్సుల కోసం 8 స్మార్ట్ తరగతి గదులు, ఈ-క్లాస్‌రూమ్స్ ఉన్నాయి. అంధ విద్యార్థులు సునాయసంగా తరగతి గదులు, ప్రిన్సిపాల్ రూంకు వెళ్లేందుకు స్పెస్లెట్ స్కానింగ్ సదుపాయం ఉన్నది. సెల్ఫోన్లో స్కానింగ్ చేసి అంధ విద్యార్థులు తాము వెళ్లాల్సిన లొకేషన్ చేరుకునేలా సౌకర్యాలు కల్పించారు. కళాశాలలో సోలార్ సిస్టంతో విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. విద్యార్థులకు ఆన్లైన్లో విద్యాబోధనలు చేసేందుకుగానూ వర్చువల్ క్లాస్ రూంలు ఏర్పాటు చేశారు.
అందుబాటులో ఉన్న కోర్సులు..
బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొత్తం 15 రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్, తెలుగు మీడియంలో బీఏ, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బీఎస్సీ లైఫ్‌సైన్స్, బీకాం కంప్యూటర్స్‌లో తెలుగు, ఇంగ్లీష్, ఊర్దూ మీడియంలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీఎస్, బీజెడ్‌సీఎస్, ఎంజెడ్సీ కోర్సులు కూడా ఉన్నాయి. కళాశాలలో 1,649 మంది విద్యార్థులు ఉండగా, వీరిలో 919 మంది బాలురు, 730 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. 22 మంది రెగ్యులర్ అధ్యాపకులు, 8 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు, 12 మంది అతిథి అధ్యాపకులు, 15 మంది బోధనేతర సిబ్బందితోపాటు ముగ్గురు అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. ప్రధానంగా 9 మంది పీహెచ్డీ అధ్యాపకులు ఉన్నారు. దీనికితోడు ఎన్సీసీతోపాటు నాలుగు ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ గ్రామీణ విద్యార్థుల కోసం ఏటా పీజీ ప్రవేశ పరీక్షల కోసం కోచింగ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.
తెలంగాణ బొటానికల్ గార్డెన్..
కళాశాల ఆవరణలో 2020లో ఏర్పాటు చేసిన తెలంగాణ బొటానికల్ గార్డెన్ చాలా ప్రత్యేకత సంతరించుకున్నది. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ఆకారంలో బొటానికల్ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. ఐదెకరాల్లో ఏర్పాటు చేసిన ఈ గార్డెన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రశంసించి రూ.50 లక్షల నిధులు కేటాయించారు. గార్డెన్లో 427 జాతులకు చెందిన 6,400 మొక్కలను నాటారు. తెలంగాణలోని 33 జిల్లాల ఆకారంలో రూపొందించిన గార్డెన్ అందరినీ ఆకట్టుకుంటున్నది.
గ్రేడ్ కోసం కృషి..
కళాశాలలో ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధనలను అందిస్తున్నాం. బొటానికల్ గార్డెన్, తెలంగాణ స్టేట్ హె ర్బేరియం సెంటర్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. దీంతో క ళాశాలకు న్యాక్ ‘ఏ’ ప్లస్ ప్లస్ గ్రేడ్ రావాలని కృషి చేస్తున్నాం. న్యాక్ బృందం సంతృప్తి చెందే విధంగా కళాశాలను అన్ని విధాలా ముస్తాబు చే శాం. కళాశాల అభివృద్ధికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స హకారం ఎంతగానో ఉన్నది. మంచి గ్రేడ్ వస్తుందని ఆశిస్తున్నాం.
– డాక్టర్ అప్పీయ చిన్నమ్మ, ప్రిన్సిపాల్, బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జడ్చర్ల