కల్వకుర్తి, సెప్టెంబర్ 6 : అధ్యాపకులు లేక విద్యాభ్యాసానికి విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ శుక్రవారం కల్వకుర్తి మున్సిపాలిటీ జయప్రకాశ్‌నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇంటర్ విద్యార్థులు ధర్నా చేపట్టారు.
కళాశాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇంటర్లో 12మంది గెస్ట్ లెక్చరర్లలో 9మందిని తొలగించడంతో ప్రసుత్తం ముగ్గురు మాత్రమే మిగిలారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యాపకులు లేకపోవడంతో ఇంగ్లిష్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బాటనీ సబ్జెక్ట్‌ల్లో వెనుబడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యాపకులు లేక తరగతి గదుల్లో ఖాళీగా కూర్చుంటున్నామని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కళాశాలకు సీవోఈ(కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్) సెంటర్ ఉందని, సీవోఈని తొలగిస్తారనే ప్రచారం వినిపిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో సీవోఈ తొలగించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
జోనల్ అధికారులు వచ్చే వరకు కళాశాల ఎదుట కూర్చుని నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటామని విద్యార్థులు భీష్మించుకొని కూర్చున్నారు. ప్రిన్సిపాల్ శ్రీధర్‌రావు జోనల్ అధికారికి ఫోన్ చేసి విద్యార్థులతో మాట్లాడించారు. సోమవారం నాటికి అధ్యాపకులను పంపిస్తామని జోనల్ అధికారి హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. అనంతరం ధర్నా విరమించి తరగతులకు హాజరయ్యారు.