కొల్లాపూర్ : జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ( Housing plots ) ఇవ్వాలని కోరుతూ పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నియోజకవర్గంలోని జర్నలిస్టులు ( Journalists ) చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి (Former MLA Beeram) సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వచ్చే జర్నలిస్టులు తమ సమస్యలపై రోడ్డుపైకి రావడం బాధాకరమన్నారు.
జర్నలిస్టులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. గతంలో తాను 30 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వపరంగా కలెక్టర్‌తో ప్రొసీడింగ్ ఇప్పించానని, ఆ రోజు గుట్టలు ఉన్న భూమిని లెవెల్ చేయించే ప్రయత్నం చేశానని వెల్లడించారు.
ఇళ్ల స్థలాల పట్టాలు ఇప్పించే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయిందని అన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రజల దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రయత్నిస్తుంటే ప్రస్తుత పాలకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. అనంతరం దీక్షా శిబిరం నుంచి బాబు జగ్జీవన్ రావు విగ్రహం వరకు జర్నలిస్టులు అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు
. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ, జిల్లా అధ్యక్షులు రామచందర్, నియోజకవర్గ కన్వీనర్ జలకం మద్దిలేటి, జిల్లా నాయకులు మల్లికార్జున, సాగర్, సీనియర్ జర్నలిస్టులు కురుమయ్య, సీపీ నాయుడు, రమణ, గోవిందు, మల్లయ్య, సందు శ్రీనివాసులు, కళ్లెపు భాను ప్రకాష్, స్వాములు, శివ, రాములు, తరుణ్, సురేందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి , మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ, మాజీ జడ్పీటీసీ జంబులయ్య, మండల అధ్యక్షులు రామచందర్ యాదవ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పెంట్లవెల్లి మండల అధ్యక్షుడు పోతుల వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్ట శ్రీనివాసులు, మాజీ మండల అధ్యక్షులు ఈదన్న యాదవ్, బీజేపీ, భజరంగ్‌దళ్, దళిత సంఘాల నాయకులు, సీపీఎం , కేవీపీఎస్, ఏబీవీపీ నాయకులు సంఘీభావం తెలిపారు.