గద్వాల, ఆగస్టు 2 : జోగుళాంబ గద్వాల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే జవహార్ నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకం బాలారిష్టాలు ఎదుర్కొంటున్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టు పరిధిలో రెండు రిజర్వాయర్లు, ఐదు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో పూర్తిస్థాయిలో నీటిని నింపుకోలేని పరిస్థితి. జూరాలకు వరద వస్తున్నా పూర్తిస్థాయిలో ఒడిసిపట్టడంలో ప్రభుత్వం విఫలమవుతున్నది.
దీంతో వచ్చిన నీళ్లన్నీ దిగువకు వదిలేస్తుండడంతో ఈ ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టుకు సరిపడా నీళ్లందక.. పంటలు ఎండిపోయి ప్రతి యాసంగి సీజన్లో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రిజర్వాయర్లు నిర్మాణం చేసినప్పటికీ పర్యవేక్షణ లోపం కారణంగా ఏనాడూ పూర్తిస్థాయి నీటిమట్టం నమోదు కాలేదు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 8 మండలాలు, 141 గ్రామాలకు లబ్ధి చేకూరుతున్నది.
ఎత్తిపోతల పథకం వివరాలు
ప్రియదర్శిని జూరాల ప్రాజుక్టు నిల్వనీటిపై ఆధారపడి, కృష్ణానది నుంచి నీటిని ఎత్తి పోసే పథకం జవహార్ నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకం. ఈ పథకంలో 21.425 టీఎంసీల నీటిని ఎత్తిపోసి గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించేలా నిర్మించారు. అయితే ఈ పథకం ద్వారా ఇప్పటికీ రైతులకు 50 నుంచి 70 వేల ఎకరాలకు మించి నీళ్లు పారని దుస్థితి నెలకొన్నది. లక్ష్యం ఘనంగా ఉన్నా ఆచరణ అంతంత మాత్రమే అన్న చందంగా మారింది. ఈ ప్రాజెక్టు కింద రెండు ప్రధాన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 5 మినీ రిజర్వాయర్లు ఏర్పాటు చేశారు. అయితే ఒక ప్రధాన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తోపాటు ఐదు మినీ రిజర్వాయర్లలో పూర్తిస్థాయిలో నీటిని నింపకపోవడంతో, అనుకున్న స్థాయిలో రైతుల చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందడం లేదు.
ప్రధాన జలాశయాలు..
ధరూర్ మండలంలోని గుడ్డెందొడ్డి వద్ద నెట్టెంపాడు ప్రాజెక్టులో మొదటి రిజర్వాయర్ టీఎంసీ కెపాసిటీతో ఏర్పాటు చేశారు. ఇక్కడ మొదటి లిఫ్ట్‌లో భాగంగా పంపింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఈ రిజర్వాయర్ 62 వేల ఎకరాలకు సాగు నీరుఅందించాలని అంచనా. అలాగే ధరూర్ మండలం ర్యాలంపాడ్ వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏర్పా టు చేశారు. దీని నీటినిల్వ సామర్థ్యం 4.20 టీఎంసీలు కాగా, రెండో లిఫ్ట్ ద్వారా రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తారు. ఈ రిజర్వాయర్ నీటి ద్వారా లక్షా 38 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తారు. ఈ రెండు రిజర్వాయర్ల మధ్య 8 కిలోమీటర్ల దూరం ఉన్నది.
మొత్తం ప్రాజెక్టు స్థిరీకరించిన ఆయకట్టు 2 లక్షల ఎకరాలు కాగా, ర్యాలంపాడ్ ద్వారానే లక్షా 38 వేల ఎకరాలకు సాగునీరు అందాలి. అంతే కాకుండా 5 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను దీని ద్వారానే నింపాల్సి ఉంటుంది. అంతటి కీలకమైన రిజర్వాయర్‌కు లీకేజీల సమస్య రావడంతో అధికారులు ప్రస్తుతం దీన్ని 2 టీఎంసీలకే పరిమితం చేశారు. అప్పటి నుంచి సాగునీరు పూర్తి స్థాయిలో అందడం లేదు. దీంతో చివరి ఆయకట్టు పంటల పరిస్థితి ప్రతిసారి ప్రశ్నార్థకంగా మారింది. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు మాత్రమే రిజర్వాయర్‌కు నీటిని ఎత్తి పోసుకోవాల్సి పరిస్థితి.
గట్టు ఎత్తిపోతలకు ర్యాలంపాడే దిక్కు..
కరువు పీడిత ప్రాంతాలైన గట్టు, కేటీదొడ్డి మండలాలను సస్యశ్యామలం చేసేందుకు నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోతల పథకానికి ర్యాలంపాడు రిజర్వాయరే ఆధారం. ర్యాలంపాడ్ నుంచి 2.80 టీఎంసీలను ఎత్తిపోసి 33 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నది. కీలకమైన ర్యాలంపాడ్ రిజర్వాయర్ లీకేజీల సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే మొత్తం ప్రాజెక్టుపైనే ప్రభావం పడే పరిస్థితి ఉన్నది.
చిన్నపాటి జలాశయాలు
నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకంలో 5 చిన్న జలాశయాలను ఏర్పాటు చేశారు. అందులో సంగాల రిజర్వాయర్ ఒకటి. దీని నీటి సామర్థ్యం 0.662 టీఎంసీలు. నీటి వనరులున్నా స్టోరేజ్ ఉంచని పరిస్థితి నెలకొన్నది. నాగర్‌దొడ్డి రిజర్వాయర్‌ను 0.692 టీఎంసీలతో ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో నింపకపోవడంతో రిజర్వాయర్ తూం భాగంలో రైతులు పంటలు సాగు చేశారు. దీంతో దిగువ రైతులకు నీరు అందించలేని పరిస్థితి నెలకొన్నది. 1.457 టీఎంసీలతో తాటికుంట రిజర్వాయర్‌ను ఏ ర్పాటు చేశారు.
రాజకీయ నాయకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా, ర్యాలంపాడ్ రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నింపకపోవడం వల్ల ఇందులో టీఎంసీ నీటిని కూడా ఇప్పటి వరకు నింపుకోలేకపోయారు. ముచ్చోనిపల్లి రిజర్వాయర్‌ను 1.634 టీఎంసీల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. వరద వస్తున్నా ఒడిసిపట్టలేని దుస్థితి నెలకొన్నది. చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ను 1.539 టీఎంసీలతో నిర్మించారు. గ్రామస్తులకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించకపోవడంతో గ్రామాన్ని ఖాళీ చేయడం లేదు. అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయించాలనే ప్రయ్నత్నం ఫలించడం లేదు.
ఒక వేళ రిజర్వాయర్‌ను నింపితే గ్రామంలోకి నీళ్లు వస్తుండంతో గ్రామాన్ని ఖాళీ చేయించడం అధికారులు, ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారింది. అధికారులు పనులు చేస్తున్నప్పటికీ రిజర్వాయర్‌కు గండి కొడుతూ నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపితే 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నది. అధికారులు, పాలకులు చర్యలు తీసుకొని రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.