వనపర్తి, జూన్ 28(నమస్తే తెలంగాణ) : పాఠశాల లు పునఃప్రారంభమై నేటికీ పక్షం రోజులవుతున్నా బడి బస్సులు ఫిట్నెస్ పరీక్షలు పొందడం లేదు. ఈ క్రమం లో బస్సుల భద్రతపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సుల ఫిట్నెస్ గడువు మే 15 తోనే ముగిసింది. బస్సులను మరమ్మతులు చేసి ఫిట్నెస్ పరీక్షలకు తీసుకురావాల్సిన యజమాన్యాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. విద్యార్థుల నుంచి ఎడాపెడా ఫీజులు వసూలు చేసే స్కూలు యజమాన్యాలు విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం విచారకరం.
వనపర్తి జిల్లాలో మొత్తం 275 పాఠశాల బస్సులున్నాయి. ఈ బస్సులన్నీ గత నెలలోనే ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొంది సిద్ధంగా ఉండాల్సి ఉంది. ఈ బస్సులకున్న గడువు నెల రోజుల కిందటే ముగిసింది. జూన్ 15న మళ్లీ ఈ విద్యా సంవత్స రం ప్రారంభమైంది. ఈ మేరకు బడులు తెరుచుకున్నాయి. ఇందులో ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ షురూ అయ్యాయి. అయితే ప్రైవేట్ పాఠశాలలు మెయింటెనెన్స్ చేస్తున్న బస్సుల ఫిట్నెస్ చేయించడంలో కొందరు యజమాన్యాలు పూర్తిగా దృష్టి పెట్టడం లేదు.
ఇంకా 50 బస్సులు పెండింగ్..
విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంకా ప్రైవేట్ బస్సుల ఫిట్‌నెస్‌ల ప్రక్రియ ముగియడం లేదు. ఫిట్నెస్ లేని బస్సుల్లో విద్యార్థులు ప్రయాణాలు చేయడం వల్ల సురక్షితం కాదని తెలిసినా పాఠశాల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా బస్సులను నడిపిస్తున్నారు. జిల్లాలో ఉన్న ప్రైవేట్ బస్సుల్లో 220 బస్సులను ఫిట్నెస్ చేయించుకున్నట్లు రవాణా శాఖ కార్యాల యంలో లెక్కలు చెబుతున్నాయి. ఇంకా మరో 50కి పైగా బస్సులు పెండింగ్‌లో ఉన్నాయి. గడువు ముగిసినా ఫిట్‌నెస్‌కు రాకుండా విద్యార్థులను చేరవేస్తున్న బస్సులపై ప్రత్యేక నిఘా ఉంచి సీజ్ చేస్తామని రవాణా శాఖ చెబుతున్నారు. కానీ జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
నిబంధనలు పాటించాలి ఇలా..
బస్సుకు పవర్ స్టీరింగ్ ఏర్పాటు చేయాలి.. డ్యాష్ ప్యానల్ బోర్డులో ఎడమ, కుడి ఇండికేటర్స్ తప్పనిసరి ఉండాలి. బ్రేకుల్లో లోపం తెలిపే ఎరుపు ఇండికేటర్ బిగించాలి. ప్యూయల్ గేజ్, స్పీడో మీటర్‌తోపాటు డ్రైవర్ సీట్ దగ్గర ఎయిర్ హ్యాండ్ బ్రేక్ ఉండాలి. గేర్ లివర్‌లో అంతర్గత స్ప్రింగ్ సక్రమంగా ఏర్పాటు చేయాలి. వెనుకదారి కనిపించేందుకు అద్దం, బస్సులో విద్యార్థుల కదలికలు కనిపించేలా ఇంటర్నల్ అద్దం, విద్యార్థులు ఎక్కడం, దిగడం స్పష్టంగా కనిపించేలా అద్దాలుండాలి. బస్సులో అత్యవసర ద్వారం, డ్రైవర్ వయస్సు 60 ఏండ్లలోపుండి ఐదేళ్ల అనుభవం ఉండాలి. పిల్లల జాబితా, ఎక్కడ దిగుతున్నారో వివరాలుండాలి. ఇలా అన్నింటినీ పరిశీలించి ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ ధ్రువీకరణను జారీ చేస్తారు.
విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి..
విద్యార్థులను బస్సులు ఎక్కించేటప్పుడు తల్లిదండ్రులు బస్సుతోపాటు డ్రైవర్ కండీషన్లను గమనిస్తుండాలి. ప్రధానంగా పిల్లలపై డ్రైవర్ సత్ప్రవర్తన, బస్సులో ఉండాల్సిన వసతులు, వనరులపైనా కూడా నిఘా పెట్టాలి. ఎలాంటి నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించినా ఆర్టీఏ లేదా పోలీసులకు పిర్యాదు చేయాలి. డ్రైవర్ పనితీరును నిశితంగా గమనించాలి. మద్యం తాగినట్లు గుర్తిస్తే వెంటనే పాఠశాలల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి.
ఫిట్నెస్ లేకుండా బస్సులు రోడ్డెక్కితే చర్యలు..
ఇంకా ఫిట్నెస్ పరీ క్షలు చేసుకోని బస్సులపైన ప్రత్యేక దృష్టి పెడ తాం. ఇప్పటి వరకే ఆయా పాఠశాలల యాజమాన్యాలు వీటి ని పూర్తి చేసుకోవాలి. మిగిలిన బస్సుల యాజమాన్యాలను గుర్తించి చర్యలు తీసుకుంటాం. ఫిట్నెస్ లేకుం డా బస్సులు రోడ్డెక్కితే సీజ్ చేస్తాం. రెండు, మూడు రోజుల్లో పెండింగ్‌లో ఉన్న బస్సుల ఫిట్నెస్లను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
– సురేశ్‌కుమార్, జిల్లా రవాణాశాఖ అధికారి