అచ్చంపేటరూరల్, ఆగస్టు 12 : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బొమ్మనపల్లి పంచాయతీ కార్యదర్శి రమేశ్‌బాబు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మరణ, జనన తేదీలను మారుస్తూ పలువురికి డెత్, బర్త్ సర్టిఫికెట్లను అందజేసి అక్రమాలకు పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొందరు 2023లో మృతిచెందినట్లు రికార్డులో చూపి సర్టిఫికెట్ జారీ చేసి మళ్లీ అదే వ్యక్తి పేరుపై తేదీలను మార్చి 2025లో సర్టిఫికెట్ అందజేయడం మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొట్రమడేలు, జల్లెల గోపయ్య, రాగుల బక్కమ్మ, కొంగర చెన్నయ్య, మేడమోని బాలయ్య, కాట్రాజు పెంటయ్యలతోపాటు పలువురికి డబుల్ డెత్ సర్టిఫికెట్లు జారీ చేశారు. ఏడాది లోపు మాత్రమే పంచాయతీ కార్యదర్శి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను జారీ చేసేందుకు అధికారం ఉండగా ఏడాది దాటితే తాసీల్దార్ కూడా ఆర్డీవో ప్రొసీడింగ్ లేకుండా జారీ చేయడానికి వీలులేదు.
కానీ బొమ్మనపల్లిలో దాదాపు 500 సరిఫికెట్లను ఆస్తులు, వారసత్వ, పింఛన్, జీవితబీమా, నూతన ఆధార్ జారీ తదితర వ్యవహారాల్లో కీలకమైన జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను పంచాయతీ కార్యదర్శి రమేశ్‌బాబు అక్రమాలకు పాల్పడి జారీ చేశాడనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహరంపై సంబంధిత ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై డీఎల్పీవో వెంకటప్రసాద్‌ను వివరణ కోరగా గురువారం బొమ్మనపల్లి గ్రామ పంచాయతీలో పర్యటించి ఆరోపణలపై విచారణ చేయనున్నట్లు తెలిపారు.