మహబూబ్‌నగర్, అర్బన్, మే14: మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కొడంగల్, నారాయణపేట, మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలన్నింటినీ పీయూలోని ఎగ్జామినేషన్ బ్రాంచ్, లైబ్రరీ బ్లాక్, భవనాల్లో ఆయా నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా సాధారణ పరిశీలకులు షెవాంగ్ గ్యాచోభూటియా సమక్షంలో, రాజకీయ పార్టీల ప్రతినిధుల, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి రవినాయక్, ఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్ రూంలను పూర్తిగా కేంద్ర బలగాల, పోలీస్ భద్రతలో ఉంచారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ ముగిసిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు మంగళవారం ఉదయం వరకు పీయూ చేరుకోగా వాటన్నింటినీ స్ట్రాంగ్‌రూంలో ఉంచి ఎన్నికల పరిశీలకుల సమక్షంలో వాటికి సీల్ వేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు ఉన్నారు.