మహబూబ్‌నగర్, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ హయాంలో పెండింగ్‌లో ఉన్న పనులను మళ్లీ శిలాఫలకాలు వేసి రిబ్బన్లు కట్ చేయడం కాదు.. పేదలకు ఉపయోగపడే వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను వెంటనే ప్రారంభించి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ నాయకులతో కలిసి మాజీ మంత్రి వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన, పక్కనే పెండింగ్‌లో ఉన్న టూరి జం ప్లాజా భవనాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా ప్రజలకు ఉపయోగపడే ఈ సూపర్ స్పెషాలిటీ దవాఖాన తమ హయాం లో 90శాతంపనులు పూర్తి చేస్తే కేవలం వసతులు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు రూ.500కోట్ల టెండర్లను పిలిచి ఆధునిక పరికరాలు బిగించాల్సిన సర్కారు ప్రారంభించకుండా వదిలేసిందని విమర్శించారు. మే ము పెండింగ్ పనులను పూర్తిచేసి దవాఖానను అందుబాటులోకి తీసుకురావాలని మాత్రమే కోరుతున్నామని ఇందులో రాజకీయం చేయడం లేదన్నారు. తెలంగాణలో మొట్టమొదటి మెడికల్ కాలేజీని మహబూబ్‌నగర్‌కి తీసుకొచ్చామని, మెడికల్ కాలేజీ నిర్మాణం పనులు కూడా పూర్తి చేశామని, పాత దవాఖాన భవనంలో కొత్త భవనాలు నిర్మించి అక్కడ వసతులు మెరుగుపరిచామ ని గుర్తుచేశారు.
మహబూబ్‌నగర్‌కు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అవసరమని కేసీఆర్‌ను ఒప్పించి వెయ్యి పడకల దవాఖాన తీసుకొచ్చామని పేర్కొన్నారు. జిల్లాలోని పేదలు కాన్సర్, గుండె, కాలేయ సంబంధిత వ్యా ధుల బారిన పడుతున్నట్లు గుర్తించి బస్టాండ్‌లో దిగిన వెంటనే వైద్యం అందేలా దవాఖాన నిర్మాణం పూర్తి చేశామన్నారు. భవనం పూర్తి అయిపోయి కలర్స్ వేసే వరకు పనులు మా హయాంలో పూర్తి చేశామని, కానీ ఎన్నికలు రావడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జూన్ 2న ప్రారంభిస్తారని భావించా..
సూపర్ స్పెషాలిటీ దవాఖానను జూన్ 2వ తేదీన ప్రారంభిస్తారని భావించామని, రూ.500కోట్లతో దవాఖానకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేస్తే దవాఖాన అందుబాటులోకి వస్తుందని దీంతో ఐదు జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కాన్సర్, గుండెపోటుతో జిల్లాకు చెందిన అనేక మంది చనిపోతున్నారని వెంటనే దవాఖానకు ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని విజ్ఞప్తి చేశారు. రెండున్నరేండ్ల నుంచి పనులు చేస్తారని వేచి చూశాం కానీ ఎలాంటి పురోగతి లేదు.. అధికారులు వెంటనే టెండర్ పిలిచి సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు ప్రారంభించాలని సూచించారు.
సోమశిల అభివృద్ధికి జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేస్తే నేను మంత్రిగా అయిన వెంటనే సోమశిలను అన్ని హంగులతో అభివృద్ధి చేశానని, ఇప్పుడు సీఎం అక్కడే బస చేస్తున్నారని తెలిసింది.. దీంతో మా చిత్తశుద్ధి ఏంటో అందరికి తెలిసిందన్నారు. సోమశిలతోపాటు ఈగలపెంట, మన్ననూరు అలాగే జోగుళాంబ వద్ద టూరిజం శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసినట్లు గుర్తుచేశారు. దవాఖాన పక్కన టూరిజం ప్లాజా పెడితే రోగులకు వసతి సౌకర్యం కల్పించవచ్చని అనుకున్నాం కానీ వాటి పనులు నిలిపివేశారన్నారు. కన్వెన్షన్ సెంటర్ కూడా అందులో ఉంది.
2023 ఎన్నికల సమయంలో భవ నం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే భవనం ఉం ని, మౌలిక వసతులు కల్పించి భవనం అందుబాటులోకి తేవాలన్నారు. అలాగే మన్యంకొండ రోప్‌వే పను లు నిలిపివేశారు.. గతంలోనే పనులు ప్రారంభమై.. సాయిల్ టెస్ట్ కూడా జరిగిందన్నారు. కానీ కాంట్రాక్టర్ వెళ్లిపోయిండు.. పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ వద్ద రోప్‌వే ఏర్పాటు చేస్తే భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. హరిత హోటల్ స్లాబ్స్ వేసినాం.. 2023 ఎన్నికల సమయంలో ఎట్టా ఉండెనో.. ప్రస్తుతం పనులు అలాగే ఉన్నాయని మండిపడ్డారు. పేదల వసతి కోసం 18 గదులు పూర్తి చేసి 100 గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, కనీసం దేవుడిపై కనికరం చూపి పనులు పూర్తి చేయాలని సూచించారు.
నీళ్ల సమస్య రావద్దని రిజర్వాయర్ కట్టాం.. కులవృత్తుల కోసం శిల్పారామం నిర్మాణం చేస్తే దానిని మూసివేశారు..పన చిల్డ్రన్స్ మ్యూజియం పార్క్ పనులు నిలిపివేశారని ఆరోపించారు. ట్యాంక్‌బండ్‌లో నెక్లెస్ రోడ్డు, ఉమెన్స్ పార్క్, ఫుడ్ కోర్టు, సీనియర్ సిటిజన్, సైకిల్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, మ్యూజికల్ నైట్ ఏర్పాటుకు అవసరమైన వసతులు ఏర్పాటు చేసి, ఐలాండ్ వెళ్లేందుకు బ్రిడ్జి పూర్తి చేసి ట్యాంక్‌బండ్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. లేకపోతే పాత ఇనుప సామానుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి టూరిజం, దవాఖానలపై మంత్రి జూపల్లి సమీక్ష చేసి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, కేసీ నర్సింహులు, గంజి వెంకన్న, శ్రీకాంత్‌గౌడ్‌తోపాటు కార్పొరేటర్లు, పట్టణ నాయకులు పాల్గొన్నారు.