జోగులాంబ గద్వాల : అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు సురక్షితంగా ఉండే విధంగా అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్ అధికారులను ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు సురక్షిత వాతావరణం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో అంగన్వాడీ కేంద్రాలు, బాల్యవివాహాలు,లైంగిక వేధింపులు, భరోసా కేంద్రాల కార్యకలాపాలు, సామ్-మామ్ కార్యక్రమం, మౌలిక సదుపాయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలు శుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో పూర్తిగా సురక్షితంగా ఉండాలన్నారు. స్వంత భవనమా, అద్దె భవనమా అన్న తేడా లేకుండా, నిర్మాణ లోపాలు, పగుళ్లు, ప్రమాదకరమైన పరిస్థితులు లేకుండా అవసరమైన మరమతు పనులు చేపట్టాలన్నారు. పరిశుభ్రత, అనుకూల వాతావరణంలో ఉండేలా చూడాలని అన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో త్రాగునీరు, సరైన విద్యుత్ సరఫరా, శుభ్రమైన మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడి సెంటర్లలో చిన్నారుల సంఖ్య పెంచాలని అన్నారు. ప్రతి మండలానికి రెండు అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, వాటి కోసం గ్రామాల్లో అనుకూలమైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలన్నారు. తక్కువ స్థాయి మరమ్మతులకు కలెక్టర్కు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
గద్వాల్ జిల్లాలో బాల్యవివాహాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, బేటీ బచావో – బేటీ పడావో’ వంటి అవగాహన కార్యక్రమాలను గ్రామ స్థాయిలో నిర్వహించాలని అన్నారు. బాల్యవివాహాల నివారణకు పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు గ్రామాల్లో చురుకుగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, బాల్యవివాహం దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. పనిచేసే స్థలాల్లో లైంగిక వేధింపుల నివారణ కమిటీ ఎప్పటికప్పుడు క్రియాశీలంగా ఉండాలని అన్నారు. సామ్-మామ్ సంబంధిత విషయాల్లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఫీల్డ్ విజిట్లు నిర్వహించి, గుర్తించి నివేదికను సమర్పించాలని అధికారులు ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల ఎదుగుదలను 100 శాతం మానిటరింగ్ చేయాలని అన్నారు. అధికారులు పిల్లల హాజరుశాతాన్ని మెరుగుపరచాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. గర్భిణీల ఆరోగ్యం, చిన్నపిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, పని పట్ల పూర్తి ఆసక్తి, బాధ్యతతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ మాట్లాడుతూ.. జిల్లాలోని చాలా అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రమైన వాతావరణం కల్పించడంతో పాటు, మరుగుదొడ్లు నిర్మించి, విద్యుత్ సౌకర్యం అందించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. బాల్య వివాహాలను అడ్డుకునే విషయంలో మంచి పురోగతి సాధించామని అన్నారు. త్వరలో అన్ని అంగన్వాడీ కేంద్రాలను ఆదర్శ కేంద్రాలుగా తీర్చిదిద్దే దిశగా పనిచేస్తున్నమని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు, జిల్లా సంక్షేమ అధికారి సునంద, సీడీపీఓలు, సూపర్వైజర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.