గద్వాలటౌన్/మహబూబ్నగర్ అర్బన్, అక్టోబర్ 30 ; దీపాలు సమృద్ధిగా వెలిగిన ఇంటిలో మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని హిం దూధర్మం చెబుతున్నది.. ఇంతటి ప్రాధాన్యత గల దీపం కార్తీకమాసంలో ఆలయాల్లో శోభాయమానంగా వెలుగుతుంటాయి.. వెండి వెన్నెలతో పోటీ పడుతూ దీపాలు వెలుగునిస్తాయి.. అమావాస్య చీకట్లను చీల్చి ఆకాశం వరకు కాంతిని విరజిమ్ముతాయి.. అంతటి దీపావళి పండుగ వ చ్చిందంటే చాలు మహిళలు రకరకాల ప్రమిదలు కొనుగోళ్లు చేసి ఇండ్ల ముంగిట అందంగా అలంకరిస్తుంటారు.. మహిళల ఆలోచనలకు తగ్గట్టుగా ఈ ఏడాది మార్కెట్లో సరికొత్త ప్రమిదలు ఆకట్టుకుంటున్నాయి.
దీపావళి సందర్భంగా ఎంతటి నిరుపేద కు టుంబమైనా చిరుదీపాన్ని వెలిగించి మురిసిపోతారు. దీపావళి కంటే ముందు అశ్వయుజ బ హుళ చతుర్ధశి వస్తుంది. దీనినే నరక చతుర్ధశిగా హైందవ ప్రజలు ఘనంగా జరుపుకొంటారు. దీపాలు వెలిగించి చెడుపై మంచి సాధించిన విజయంగా గొప్పగా నిర్వహించుకుంటారు. దీపాలను వెలిగించే ప్రమిదల ఎంపిక అంతా ఇంతా కాదు. ముఖ్యంగా దీపాలను మట్టి ప్రమిదల్లో వెలిగించడం సంప్రదాయం.
భిన్నమైన ఆకృతులు..
మట్టి ప్రమిదల వినియోగం హైందవ సం స్కృతిలో ఒక భాగం. దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. మిగతా రోజుల్లో వివిధ రకా ల ప్రమిదల్లో దీపాలను వెలిగించినా.. దీపావళికి మట్టి ప్రమిదలు ఉపయోగించడం శుభప్రదమని భావిస్తారు. దీంతో ఏటా భిన్నమైన ఆకృతుల్లో దీపాలు అమ్మకానికి వస్తున్నాయి. చిన్నిచిన్ని దీపాల నుంచి అడుగు దీపాల వరకు మా ర్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కొబ్బరికాయ ఆకారంలో దీపం, తులసికోట, పల్లెపడుచులు నెత్తిన దీపం పెట్టుకున్నట్లు, శంఖం, తాబేలు, స్వస్తిక్, గోడలకు వేలాడదీసే ప్రమిదలు ఇలా చాలా ఉన్నాయి. రూ.2 నుంచి రూ.150 వరకు దీపాల ధరలు పలుకుతున్నాయి. గణపతి, లక్ష్మీదేవీ ప్రతిమలు కూడా ఉన్నాయి. ప్రమిదల కొనుగోలుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు.
పాలమూరులో సందడి
పాలమూరు పట్టణంలోని అనేక చౌరస్తాలో మట్టి ప్రమిదలు, బంతి, చామంతి పూల విక్ర య కేంద్రాలు భారీగా వెలియడంతో కొనుగోలు దారులతో రహదారులన్నీ సందడిగా మారాయి. స్థానిక బాలుర కళాశాల మైదానంలో పటాకులు అమ్మకాల కోసం ప్రత్యేక షాపులను ఏర్పాటు చే శారు. పూలధరలతోపాటు స్వీట్లు, పటాకుల ధరలు కూడా భారీగా పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో రూ.500 తీసుకువస్తే సంచినిండా పటాకులు వచ్చేవని ఇప్పుడు రూ.వెయ్యి తీసుకుపోయినా అనుకున్న పటాకులు కొనలేకపోతున్నామం టున్నారు. కిలో రూ.600 చొప్పున పటాకులు విక్రయిస్తుండడం విశేషం.