చారకొండ, ఫిబ్రవరి 4 : కాయకష్టం చేసి నిరుపేదలు ఇండ్లు నిర్మిచుంటే తమ కండ్ల ముందే ఇండ్లను నేలమట్టం చేయడంతో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారి చారకొండ మండల కేంద్రం మీదుగా వెళ్తుంది. అయితే ఇందుకోసం బైపాస్ రోడ్డును వేయకుండా ప్రస్తుతం ఉన్న పాత రోడ్డునే విస్తరించాలని ప్రజలు, నిర్వాసితులు కోరుతున్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణం వల్ల 29 ఇండ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములు కోల్పోతున్నామని నిర్వాసితులు ఎన్నోసార్లు ఆందోళనలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామునే కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసు బలగాలు మండల కేంద్రానికి భారీగా చేరుకున్నారు.
ఒక్కసారిగా పోలీసులు పెద్ద ఎత్తున మొహరించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బైపాస్ నిర్మాణంలో పోతున్న ఇండ్లను పోలీసులు చుట్టుముట్ట్టి బాధితులకు ముందస్తుగా ఏలాంటి సమాచారం ఇవ్వకుండా జేసీబీల సహకారంతో ఇండ్లను నేలమట్టం చేశారు. తమకు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా వచ్చి దౌర్జన్యంగా కూల్చి వేస్తే మేము ఇప్పుడు మా సామాన్లు తీసుకొని ఎక్కడికి వెళ్లాలని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. అధికారులు కనీసం ప్రత్యామ్నాయం చూపకుండా తమను రోడ్డుపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ప్లాటు కూడా కొనలేని దుస్థితి ఉందన్నారు. ఏకపక్షంగా అధికారులు వ్యవహరించి తమ ఇంట్లో సామగ్రి తీయకుండా కాంట్రాక్టర్ కూలీలతో సామాన్లు ట్రాక్టర్లలో తీసుకెళ్లి రైతు వేదిక, సింగిల్ విండో గోదాంలో ఉంచారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా తన ఇంటి కూల్చోదని గిరిజమ్మ అనే బాధితురాలు అధికారులను వేడుకున్నా.. బలవంతంగా ఆమె ఇంట్లోకి పోలీసులు ప్రవేశించి బాధితురాలితోపాటు ఆమె ఇద్దరి కూతుళ్ల్లను అరెస్టు చేసి వెల్దండ పోలీస్‌స్టేషన్‌కు తరలించిన అనంతరం ఇంటిని కూల్చివేశారు. అదేవిధంగా యాదమ్మ అనే బాధితురాలు తన ఇంటిని కూలుస్తున్న సమయంలో స్పృహతప్పి కింద పడిపోయింది. తీవ్ర ఉద్రిక్తత మధ్య బైపాస్‌లో నిర్మాణంలో అడ్డుగా ఉన్న ఇండ్లను పూర్తిగా తొలగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వెల్దండ సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, స్థానిక ఎస్సై శంషోద్దీన్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్డీవో వెంట తాసీల్దార్ సునీత, ఎంపీడీవో ఇసాక్‌హుస్సేన్, ఎన్హెచ్డీఈ రమేశ్, అర్అండ్బీ ఈఈ కరుణాకర్, విద్యుత్ ఏఈ జానీరాంనాయక్తో పాటు రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
సమాచారం ఇవ్వకుండా కూల్చేశారు..
కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిలో బైపాస్‌లో నా ఇల్లు కూల్చివేశారు. మా ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న సామన్లు బయటికి వేశారు. నాకు కనీసం నోటీసు కానీ సమాచారం కూడా ఇవ్వలేదు. ఇంత దౌర్జన్యంగా వచ్చి పోలీసులు జేసీబీతో ఇల్లు కూల్చడం సరికాదు. నాకు 262గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే 218గజాలకే పరిహారం ఇచ్చారు. ఇప్పటికైనా అధికారులు మళ్లీ సర్వే చేసి నాకు పూర్తి పరిహారం అందించి ఆదుకోవాలి. లేదంటే ఆర్థికంగా నా కుటుంబం చితికిపోడం ఖాయం.
– నూనె విష్ణు, మర్రిపల్లి, చారకొండ మండలం
ఇల్లు కూల్చి రోడ్డుపాలు చేశారు..
సమాచారం ఇవ్వకుండా అధికారులు నా ఇంటిని చుట్టుముట్టి పోలీసుల బలగాలతో ఇల్లు కూల్చారు. మేమే మా సామాన్లు తీసుకుంటామని కొంత సమయం ఇవ్వండని మొర పెట్టుకున్నా బలవంతంగా వాళ్లే వ్యాన్‌లో సామాన్లు తీసుకెళ్లి రైతు వేదికలో వేశారు. ఎలాంటి ప్రత్యామ్నాయం చూపించకుండా ఇలా కూల్చి వేస్తే మేము మా పిల్లలు ఎక్కడికి పోవాలి. గూడు లేకుండా చేస్తే ఎక్కడ ఉండాలి. ప్రభుత్వం ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలి.
-నల్ల రాములమ్మ, చారకొండ