అయిజ, జనవరి 15 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో నీటి నిల్వ క్రమేపీ పెరుగుతున్నది. ఆర్డీఎస్ ఇండెంట్‌తోపాటు కేసీ కెనాల్ ఇండెంట్ 2.50 టీఎంసీల నీటిని మంగళవారం టీబీ డ్యాం నుంచి తుంగభద్ర నదిలోకి విడుదల చేయడంతో ఆర్డీఎస్ ఆనకట్టకు జలకళ సంతరించుకున్నది. ఈ నెల 8నుంచి ఆర్డీఎస్ నీటి వాటా 1.04 టీఎంసీల నీళ్లు టీబీ డ్యాం నుంచి విడుదల చేసినా ఆనకట్టకు చేరడం ఆలస్యమైంది. ఇదే విషయమై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి జూ పల్లి కృష్ణారావుతోపాటు తెలంగాణ జలవనరులశాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వర్రావు, సీఈ కబీర్‌బాషా, ఎస్ఈ బాలచంద్రారెడ్డితోపాటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిలు ఎప్పటికప్పుడు సంప్రదించి ఆర్డీఎస్ నీటితోపాటు ఏపీలోని కేసీ కెనాల్ ఇండెంట్‌ను జాయింట్‌గా విడుదల చేస్తే ఏపీలోని కేసీ కెనాల్ ఆయకట్టుతోపాటు తెలంగాణలోని ఆర్డీఎస్ ఆయకట్టుతోపాటు తుమ్మిళ్ల ఆయకట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు.
దీంతో మంగళవారం ఏపీలోకి కేసీ కెనాల్ ఇండెంట్ 2.50 టీఎంసీల నీటిని విడుదల చేయాలని టీబీ డ్యాం అధికారులను కో రారు. కర్ణాటకలోని గుండ్లకేరి నుంచి వెయ్యి క్యూసెక్కు లు, టీబీ డ్యాం నుంచి వెయ్యి క్యూసెక్కుల చొప్పున 15 రోజులపాటు నీళ్లు విడుదల కానున్నాయి. కేసీ కెనాల్, ఆర్డీఎస్ ఇండెంట్ నీటి విడుదలతో శుక్రవారం నాటికి ఆర్డీఎస్ ఆనకట్ట ఓవర్ ఫ్లో అయ్యే అవకాశాలు ఉన్నాయని అ ధికారులు చెబుతున్నారు. బుధవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 958 క్యూసెక్కులు ఉండగా, ఆర్డీఎస్ ప్రధానకాల్వకు 598 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దిగువకు 123 క్యూసెక్కులు ఆర్డీఎస్ కన్స్ట్రక్షన్ స్లూయిస్ రంద్రాల గుం డా దిగువకు ప్రవహిస్తుంది.
ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 7.9 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఆర్డీఎస్ ఈఈ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్టలో నీటినిల్వ పెరిగితే ఆర్డీఎస్ ప్రధానకాల్వకు నీటి విడుదల పెంచుతామని ఆయన పేర్కొన్నారు. సుంకేసుల బ్యారేజీలో ఎఫ్ఆర్ఎల్ 292అడుగులకు పెరిగితే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ప్రా రంభించి దిగువకు నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నా రు. ఆర్డీఎస్ ఆనకట్టకు నీటి చేరిక భారీగా పెరుగుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీఎస్ ఇం డెంట్‌తోపాటు కేసీ కెనాల్ ఇండెంట్ నీటి విడుదలతో ఆర్డీఎస్ ఆయకట్టులో సాగు చేసిన పంటలకు సాగునీరు పుష్కలంగా అందుతుందని భావిస్తున్నారు. మార్చి 20వరకు సాగునీరు అందించి పంటల దిగుబడికి చర్యలు తీసుకోవాలని ఇరురాష్ర్టాల అధికారులను రైతులు కోరుతున్నారు.
టీబీ డ్యాంలో ..
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో నిలిచిపోగా, అవుట్‌ఫ్లో 11,314 క్యూసెక్కులు నమోదైంది. 105.788 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 69.322 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 1633 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి గానూ ప్రస్తుతం 1622.73 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.