Gadwal | అయిజ, ఫిబ్రవరి 14 : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో నంబర్ ప్లేట్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి కొత్తగా నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసే ప్రక్రియను అధికారులు ఓ ప్రయివేటు ఏజెన్సీకి అప్పగించారు.
ఈ ప్రయివేటు ఏజెన్సీ.. నాసిరకం నంబర్ ప్లేట్లను అమర్చుతూ, దానిపై మార్కర్‌తో ఆ ఇంటి వివరాలను నమోదు చేస్తున్నారు. ఇందుకు ప్రతి ఇంటి యజమాని వద్ద రూ. 60 వసూలు చేస్తున్నారు. నాసిరకం నంబర్ ప్లేట్లను అమర్చడమే కాకుండా.. ప్రింట్ స్థానంలో మార్కర్‌తో రాయడం ఏంటని ఏజెన్సీ సిబ్బందిని మున్సిపాలిటీ వాసులు నిలదీశారు. నాణ్యత లేని నంబర్ ప్లేట్లకు రూ. 60 వసూలు చేయడం తగదని ప్రశ్నించారు. మున్సిపాలిటీ అధికారులు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తమ పని తాము చేస్తున్నామని ఏజెన్సీ సిబ్బంది చెబుతున్నారు.
ఇప్పటి వరకు 5 వేల ఇండ్లకు నాసిరకం నంబర్ ప్లేట్లను అమర్చి అడ్డంగా దోచుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నాసిరకం నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేస్తున్న ఏజెన్సీపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో అధికారులు చొరవచూపాలని మున్సిపాలిటీ వాసులు కోరుతున్నారు.