Operation Sindoor | మహబూబ్‌నగర్, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఎస్పీలతోపాటు ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తున్నది. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని నిఘావర్గాలు చెబుతున్నాయి.
అపరిచితులకు, గు ర్తింపుకార్డు లేని వారికి హోటళ్లలో వసతులు కల్పించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగం సోషల్ మీడియా పోస్టులపై, మీడియాలో వచ్చే వార్తలపై నిఘా ముమ్మరం చేశారు. మరోవైపు ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా ఆయాచోట్ల ర్యాలీలు నిర్వహించారు. మన జవాన్లకు సంఘీభావం ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గ్రామాల్లో సైతం ప్రజలు ఆపరేషన్ సిందూర్‌పై చర్చించుకుంటున్నారు. జ మ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కా ల్పులు జరిపి అమాయకులైన టూరిస్టులను పొట్ట న పెట్టుకోవడంపై భారత్ ప్రభుత్వం చేసిన చర్యను ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు.
సోషల్ మీడియాపై పోలీస్ నజర్..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పోలీస్ యంత్రాంగం సోషల్ మీడియాపై నిఘా ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు ఆయా గ్రూపుల్లో వస్తున్న పోస్టులను నిషితంగా పరిశీలిస్తున్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టే పోస్టులు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి వివరించారు. యుద్ధానికి సంబంధించి రెచ్చగొట్టే విధంగా ఎవరు కూడా పోస్టులు పెట్టవద్దని, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ప్రార్థన స్థలాలు, మందిరాల వద్ద ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
అపరిచితులు కనిపిస్తే సమాచారమివ్వండి..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కడైనా అపరిచితులు కనిపిస్తే పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారమివ్వాలని ఎస్పీలు కోరారు. అపరిచిత వ్యక్తులపై నిఘా ఉంచాలని హోటళ్లు, రెస్టారెంట్లు దాబాలకు సమాచారమిచ్చారు. మరోవైపు పోలీసులు రహదారులపై చెక్‌పోస్ట్‌లు పెట్టి వాహనాల తనిఖీని ముమ్మరం చేశారు.
కొత్త వ్యక్తులను ఎవరినీ హోటళ్లలోకి అనుమతించవద్దని, గుర్తింపుకార్డులు ఉంటేనే వసతి కల్పించాలని కోరుతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పోలీస్ రెవెన్యూ ఇతర శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేశారు. 24గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. కాగా, గ్రామాలు, పట్టణాల్లో ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా పలువురు ర్యాలీలు నిర్వహించారు. ఆర్మీ జవాన్లకు మద్దతు ప్రకటించారు. భారత్ మాతకు జై, జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు.
భద్రతకు పకడ్బందీ చర్యలు..
దేశ సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మహబూబ్‌నగర్ జిల్లాలో ముందస్తు భద్రత చర్యలు చేపడుతున్నాం. పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు. సెలవులు రద్దు చేసి 24గంటలపాటు విధుల్లో ఉంటున్నారు. ప్రజలు అనుచిత పోస్టులు, తప్పుడు సమాచారాన్ని షేర్ చేయొద్దు. దేశ భద్రత, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్ట్‌లు చేస్తే చర్యలు తప్పవు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. గుర్తింపు లేకుండా లాడ్జీలు, హోటళ్లలో వసతి కల్పించవద్దు.
– డి.జానకి, ఎస్పీ మహబూబ్‌నగర్ జిల్లా