అమ్రాబాద్, జూన్ 7 : నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్తోపాటు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. పది రోజులుగా కురుస్తున్న చిరుజల్లులకు ఆయా గ్రామాల్లోని చెరువుల్లోకి వరద చేరుతుండగా.. గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి బీకే తిర్మలాపూర్ చెరువు నిండుకుండలా మారింది. మొల్కమామిడిలోని బండలదేవి చెరువుతో పాటు ధర్మసముద్రం, తుర్కల చెరువు అలుగు పారాయి. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా చెరువు నిండకపోవడంతో బోరుబావులు అడుగంటి అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో రైతులు సంతోషిస్తున్నారు.
కొల్లాపూర్, జూన్ 7 : కొల్లాపూర్ మండలంలో గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి నార్లాపూర్-ముక్కిడిగుండం గ్రామాల మధ్యనున్న పెద్దవాగు ఉప్పొంగింది. దీంతో ఇరు గ్రామాల ప్రజలు శుక్రవారం వాగును దాటేందుకు ఇబ్బందులు పడ్డారు. వర్షం కురిసిన ప్రతిసారి పెద్దవాగును దాటేందుకు ముక్కిడిగుండం ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. పెద్దవాగుపై వంతెన నిర్మాణానికి టెండర్లు వేస్తున్నారు తప్పా.. పనులు మాత్రం జరగడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. వెంటనే పెద్దవాగుపై వంతెనను నిర్మించాలని ముక్కిడిగుండానికి చెందిన సీపీఎం నాయకుడు అశోక్ శుక్రవారం ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఉండవెల్లి, జూన్ 7 : మండలంలోని పుల్లూరు, అలంపూర్ చౌరస్తా, బొంకూరు ఉండవెల్లి, తక్కశిల, భైరాపురం గ్రామాల్లో శుక్రవారం సాయత్రం భారీ వర్షం కురిసింది. సాయత్రం 5గంటలకు మొదలై రాత్రి 7 గంటల వరకు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పుల్లూరు కుమ్మరివీధిలోని ప్రధాన కాల్వపై వరద నాలుగు అడుగుల మేర ప్రవహించింది. దీంతో ఆయా కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా గ్రామాల్లో 2.6సెం.మీ.ల వర్షపాతం నమోదు కాగా అలంపూర్ చౌరస్తా, పుల్లూరులో 4.2 సెం.మీ.ల వర్షపాతం నమోదైనట్లు మండల గణాంక అధికారి హరికృష్ణ తెలిపారు.
ధరూరు, జూన్ 7 : అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్ట్‌లోకి వరద చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 1, 588 క్యూసెక్కుల వరద చేరినట్లు వారు పేర్కొన్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 318.516 మీటర్లలో 1,045 అడుగులకు గానూ ప్రస్తుతం 315.140 మీటర్లలో 1,033.92 అడుగులకు చేరినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
అయిజ, జూన్ 7 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద స్వల్పంగా కొనసాగుతున్నది. ఎగువన కురిసిన వర్షాలకు శుక్రవారం 4,329 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉం డగా, సుంకేసుల బ్యారేజీకి 4,329 క్యూసెక్కులు చేరుతున్నట్లు ఆర్డీఎస్ ఏఈ రాందాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 8.4 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎగువ ప్రాంతాల్లో అడపాదడపా కురుస్తున్న వానలతో కర్ణాటకలోని టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 2,190 క్యూసెక్కులు ఉండగా, 10 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదైం ది. టీబీ డ్యాం 100.855 గరిష్ట నిల్వ సామర్థ్యానికి గా నూ ప్రస్తుతం 3.817 టీఎంసీల నిల్వ ఉన్నది. 1,633 అడుగులకు గానూ ప్రస్తుతం 1,578.57 అడుగులకు చేరినట్లు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.