చారకొండ, జూన్ 20 : నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని సిరుసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలని, ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండానే కూల్చివేడంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్రవారం మండలంలోని సిరుసనగండ్ల (అయోధ్యనగర్)లో కూల్చిన ఇండ్లను పరిశీలించి, బాధితులతో సమావేశం నిర్వహించారు. తాము 50 ఏండ్లుగా ఇక్కడే ఉంటూ కాయకష్టం చేసి ఇండ్లు నిర్మించుకొని జీవనం గడుపుతున్నామని, ఒక్కసారిగా తెల్లవారు జామున పోలీసు బలగాలతో వచ్చి తమ ఇండ్లు కూల్చేశారని మాజీ ఎమ్మెల్యేల ఎదుట బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ న్యాయవ్యవస్థ, చట్టాలపై గౌరవం ఉందని, కానీ ప్రభుత్వం బాధితులకు పునరావాసం కల్పించిన తర్వాత కూల్చివేస్తే బాగుండేదన్నారు.
ఈ ప్రాంత ముద్దబిడ్డ అని గొప్పలు చెపుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే హుటాహుటిన అధికారులను ఆదేశించి బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి పునరావాసం కల్పించే విధంగా ఆదేశించాలన్నారు. గూడు చెదిరి అమాయక ప్రజలు రోడ్డున పడి ఉంటే కనీసం పరామర్శిం చడానికి కూడా పాలకులకు సమయం లేదా అని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం మానవదృక్పథంతో ఆలోచించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఈలాంటి పరిస్థిలు మళ్లీ పునావృతం అయితే వేలాది మంది రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో 420 వాగ్ధానాలు, ఆరు గ్యారెంటీలు, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటలకు సిద్ధం అవుతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు మళ్లీ నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు.
ఇండ్లు కోల్పోయిన బాధితులకు అన్ని విధాలుగా ఉండగా ఉంటూ వారు ఇండ్లు నిర్మించుకునేందుకు మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్యాదవ్లు ఒక్కొకరూ ప్రతి బాధిత కుటుంబానికి రూ. లక్ష చొప్పున అందించి ఆదుకుంటామని భరోసా కల్పించారు. తక్షణ సాయంగా నిత్యావసర వస్తులకు రూ. 2లక్షలు బాధితులకు అందజేశారు. అదేవిధంగా సిరుసనగండ్ల బీఆర్ఎస్, మాజీ సర్పంచ్ యాతంశ్రీనివాస్ బాధితులకు తన సొంత భూమి ల్లో ఇండ్ల స్థలాలు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు.
తమ ఇండ్లు కూల్చివేడయంతో బాధితులు ఆగ్రహానికి గురై ఆలయ చైర్మన్ డేరం రామశర్మ, అర్చకులు మురళీధర్‌శర్మ, లక్ష్మణ్శర్మతోపాటు మేనేజర్ నిరంజన్ దిష్టిబొమ్మలు తయారు చేసి ఫొటోలు పెట్టి ఊరేగింపు చేసి ప్రధాన రహదారిపై దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మసత్యం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్, యూత్ ప్రెసిడెంట్ చండీశ్వర్గౌడ్, నాయకులు సలీం, రామకృష్ణ, రమేశ్, కమలాకర్‌రావు, సరిరాం, రాంలాల్, లక్ష్మణ్‌నాయక్, శ్రీశైలం, మోహన్‌రెడ్డి, అనిశెట్టిశ్రీను, పశులశ్రీను, మహేశ్, మధుగౌడ్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.