అచ్చంపేట, ఏప్రిల్ 28: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ చేసిన నయవంచన మోసాన్ని, అబద్ధాల హామీలు, మోసం తీరును ఎండగట్టిన విధానాన్ని పార్టీశ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. ఆదివారం వరంగల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాగర్‌కర్నూ ల్ జిల్లా నుంచి తరలివచ్చి దిగ్విజయం చేసిన ప్రజానికానికి, సభ విజయవంతం కోసం కృషిచేసిన మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, హర్షవర్ధన్‌రెడ్డికి సోమవారం ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అబద్ధాల కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేవిధంగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వంచించి మోసం చేస్తున్న కాంగ్రెస్ విధానాన్ని పసిగట్టిన ప్రజలు తేరుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్‌ను ఓడిస్తారన్నారు.
నారాయణ పేట, ఏప్రిల్ 28: రజతోత్సవ సభలో మాజీ సీఎం, గులాబీ దళపతి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటిస్తామని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. ఓరుగల్లుకు సభకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లు, అభిమానులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అసమర్థ పాలన ను ఎప్పటికప్పుడు తిప్పికొడతామని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిషారంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు.
దేవుడి కృపతో చిన్నపాటి అవాంతరం లేకుండా దాదాపు 345 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓరుగల్లుకు కార్యకర్తలు, నాయకులు క్షేమంగా వెళ్లి, క్షేమంగా రావడంపై ఈ సందర్భంగా దేవుడిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఇన్నిరోజులు గుర్తుకు రాని నిబంధనలు ఇప్పుడే గుర్తుకొచ్చినట్లు కాంగ్రె స్ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకొని సభకు వెళ్లే వాహనాలను అడ్డుకొనే ప్రయత్నం చేసినా.. సభ విజయవంతమైందన్నారు. ఎల్క తుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ప్రపంచ స్థాయిలో ప్రజలు ఆసక్తి కనబరిచారని, ముఖ్యంగా కేసీఆర్ స్పీచ్ కోసం ప్రత్యక్షంగా 20లక్షల మంది, పరోక్షంగా ప్రపంచ స్థాయిలో కోట్లాది మంది టీవీల్లో వీక్షించారని పేర్కొన్నారు. వరంగల్ సభా వేదికగా కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తామన్నారు.