Govindamamba Veerabrahmendra Swamy | అయిజ, ఫిబ్రవరి 16: అయిజ పట్టణ సమీపంలోని మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర శివ రామాలయంలో ఆదివారం గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం కమణీయంగా జరిగింది. ఐదో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 12 గంటలకు వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల గోవింద నామస్మరణలు, భాజా భజంత్రీల నడుమ గోవిందమాంబ మెడలో వీరబ్రహ్మేంద్రస్వామి మాంగళ్యధారణ చేశారు.
అంతకు ముందు ఉదయం వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబలకు సుప్రభాత సేవ, స్వస్తిపారాయణం, ఉత్సవ మూర్తులకు అభిషేకం, పూర్ణాహుతి నిర్వహించారు. అటుపై పండితులు వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల కల్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల కల్యాణం కనులారా చూసేందుకు భక్తులు అశేషంగా తరలొచ్చారు.
సాయంత్రం గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఆశీనులుకాగా కాళికాదేవీ అమ్మవారి ఆలయం వరకు భక్తుల గోవింద నామస్మరణలు, భాజా భజంత్రీల నడుమ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదాన వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.