మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూన్ 20 : కుల వృత్తులు సజీవంగా ఉండాలని.. అన్నివర్గాల ప్రజల వ్యాపార అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా బీఆర్ఎస్ హయాంలో శిల్పారామం నిర్మిస్తే ఇప్పుడు దాని నిర్వాహణ గాలికివదిలేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం ఎంత వరకు సమంజసమని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి పరిరక్షించాలని కోరారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ సమీపంలోని శిల్పారామంను బీఆర్ఎస్, పట్టణ ప్రముఖులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడారు. హైదరాబాద్‌కు దీటుగా పాలమూరులో సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు అద్దంగా రూ.17కోట్లు వెచ్చించి శిల్పారామం నిర్మిస్తే.. నిర్వహణ భారంగా మారిందనే నెపంతో ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. శిల్పారామంను ఎంతో ఆహ్లాదకరం గా ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో తరహా నాణ్యమైన ఒరిజినల్ వస్తువులను తీసుకొచ్చి పది కాలాల పాటు ఉండే లా నిర్మిస్తే .. ప్రజాపాలనలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్వహణను సైతం గాలికి వదిలేశారన్నారు. ఒక్కో కుల వృత్తికి ఒక దుకాణం ఉండాలి.. మన సంస్కృతి ప్రతిబింబించాలని షాపులు కట్టామని, ఇక్కడ కేవలం కరెంట్ బిల్లు, నిర్వహణ బిల్లు మాత్రమే వసూలు చేస్తామని అనాడే చెప్పామన్నారు.
కళా ప్రదర్శనలు, చిన్న చిన్న ఫంక్షన్లతో పాటు పే ద, మధ్య తరగతి కుటుంబాలు ఇంటి వద్ద స్థలం లేని వారు ఫంక్షన్ చేసుకోవాలనే లక్ష్య ంగా ఆడిటోరియం కట్టామని తెలిపారు. ఫుడ్ కోర్టుతోపా టు మిగిలిన మూడెకరాల్లో సౌత్ కొరియా, నార్త్ కొరియా ఇన్విజ్మెంట్ పార్క్, వేవ్ ఫూల్, స్విమ్మింగ్‌పూల్ నిర్మాణానికి టెండర్ ఖరారైంది. వర్క్ కూడా నడుస్తుండే.. ఎలక్షన్ కోడ్ వచ్చింది.. ఆ తర్వాత ఏమైందో తెలియదన్నా రు. ఎందుకిలా చేశారో టూరిజం శాఖ మంత్రికి, సంబంధిత అధికారులకే తెలియాలన్నారు.
టూరిజం పార్టీకి చెందిన ప్రాపర్టీని మున్సిపల్ వాళ్లు టెండర్ ఇవ్వడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఈ ఏడాది మే నెలలో టూరిజం శాఖ వారు మున్సిపల్‌శాఖకు శిల్పారామం అప్పగించారని అంటున్నారు.. కానీ ఏడాది కిందటే షాపులకు వేలం నిర్వహించామని మళ్లీ మున్సిపల్ అధికారులే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇన్ని కోట్లు పెట్టి ఇంత అద్భుతంగా శిల్పారామం నిర్మిస్తే ప్రైవేట్‌కు అప్పగిస్తారా.? కేవలం ఊడ్చటం కూడా మున్సిపాలిటీకి చేతకాదా..? మీకు చేతకాకుంటే తిరిగి టూరిజం శాఖకే అప్పగించాలని డిమాండ్ చేశారు.
ట్యాంక్‌బండ్‌పై దుకాణాలు ముడా నిధులతో కడుతున్నామని మున్సిపల్ అధికారులు అంటున్నారని చెరువు కట్టపై నిబంధనలకు విరుద్ధంగా ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. వెయ్యి పడకల సూ పర్ స్పెషాలిటీ దవాఖానను ఏదో సాకుపెట్టి ప్రైవేట్‌కు కట్టబెట్టేలా ఉన్నారని ఆరోపించారు. కళాభారతిలో మూడ్రో జుల్లో పూర్తి చేసే పనులు ఉంటే మూడేళ్లు అయినా పట్టించుకోవడం లేదన్నారు. శిల్పారామంను లీజుకు తీసుకున్న పెద్దలెవరో జాగ్రత్తగా ఉండాలని.. వారు సైతం బద్నాం అవుతారని పునః ఆలోచించాలని కోరారు. నగర పాలక సంస్థలో అంతా పర్సెంటేజీల దందా కొనసాగుతోందని, 10 శాతం ఇవ్వాలంటే కాంట్రాక్టర్లు ఎట్లా బతుకుతారు.. నాణ్యమైన పనులు ఎలా అవుతాయని ప్రశ్నించారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టిన ఈ శిల్పారామంను ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా విశ్రాంత ఉద్యోగులు, లేదా కుల వృత్తుల వారికి లేదా మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించండి.. వాళ్లే మెయింటెనెన్స్ చేసుకుంటారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఉచితంగా ఇస్తారు.. మిగిలిన వాటికి నామినల్‌గా కొంత నగదు తీసుకుంటారని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజివెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, కార్పొరేటర్లు జ్యోతి, సత్యం, నవకాంత్, ఈశ్వరయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేశ్, నేతలు జహంగీర్, నరేశ్, శ్రీనివాస్‌రెడ్డి, సతీశ్, సా యిలు, క్రాంతి, శాంతయ్య, శ్రీను, నర్సింహ పాల్గొన్నారు.