అక్టోబర్ 14 : తన తండ్రి పేరుపై ఉన్న భూమిని కొందరు ఆక్రమించారంటూ అతడి కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. అయిజ మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన వడ్డె సవారన్నకు యాపదిన్నె శివారులోని 321 సర్వే నెంబర్లో ప్రభుత్వం 1986 సంవత్సరంలో ఐదెకరాల పొలం ఇచ్చింది.
ఈ భూమిని ఆయన మరణానంతరం కుమారులు వడ్డె పరశురాముడు, వడ్డె తిమ్మప్ప, వడ్డె కృష్ణ సాగు చేసేవారు. అయితే, ఆ తర్వాత సవారన్న పేరుపై ఉన్న పొలాన్ని అతడి కొడుకుల పేరుపై అధికారులు ఎక్కించలేదు. దీంతో తమకు తెలియకుండా అట్టి భూమిని చుట్టుపక్క పొలాల రైతులు ఆక్రమించుకొని.. బెదిరిస్తున్నారని ముగ్గురు కుమారులు వాపోయారు. ఈ విషయంపై పలుమార్లు కలెక్టర్, తాసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు.
హైకోర్టును ఆశ్రయించగా.. భూమిని సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఏడీ, సర్వేయర్‌ను ఆదేశించారని తెలిపారు. ఆ తర్వాత పొలంలో మోక మీద మేము లేమంటూ అధికారులు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని, ఆ తర్వాత ధరణి పోర్టల్‌లో వేరేవారి పేర్లను అక్రమంగా చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమని అడిగితే అదే గ్రామానికి చెందిన భూమిని ఆక్రమించిన ఐదుగురు (లోకేశ్వర్‌రెడ్డి, చావలి గోవిందమ్మ, సి.సత్యారెడ్డి, చాకలి శంకరన్న, ఎల్లారెడ్డి) బెదిరింపులకు పాల్పడుతున్నారని వడ్డె పరశురాముడు వాపోయారు.
ఇదే విషయమై సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో అధికారులకు ముందు సదరు రైతు లు వారి సమస్యను ఏకరువు పెట్టారు. కాగా, అధికారులను అడిగితే చచ్చినా భూమి మీ పేరుపైకి ఎక్కదని చెబుతున్నారని సవారన్న పెద్ద కొడుకు పరశురాముడు ఆందోళన చెందుతూ తన వెంట తెచ్చుకొన్న పురుగు మందును తాగే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకొని దవాఖానకు తరలించారు.