వడ్డేపల్లి : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలంలో నిర్వహించనున్న ఉత్సవాలకు పాదయాత్రగా తరలి వెళ్తున్న భక్తులకు జులకల్ గ్రామ శివారులోని ఆడియోస్ కాల్వ వద్ద అల్పాహారం అందజేశారు. గ్రామానికి చెందిన కరణం సీతారామారావు, రూప శ్రీ దంపతులు జులకల్ స్టేజీ సమీపంలో ప్రధాన రోడ్డు పక్కన భక్తులకు చల్లని రత్న మజ్జిగ, తాగునీరు మందు గోలీలు పంపిణీ చేశారు. అలాగే మహిళా భక్తులకు కుంకుమ, పసుపు, గాజులను అందజేశారు.
మండుటెండలో పాదయాత్ర చేస్తున్న పాదయాత్రికులకు తాను గత పదేళ్లుగా తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సేవలందిస్తున్నానని దాత సీతారామరావు తెలిపారు. ఇక్కడే కాకుండా శ్రీశైలంలో కూడా శ్రీ పూర్ణానంద స్వామి ఆశీస్సులతో అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటానని అన్నారు. భక్తితో పాదయాత్ర చేస్తున్న వారికి ఏమిచ్చినా తక్కువేనని, తానే కాకుండా చాలామంది దాతలు అక్కడక్కడ షెల్టర్లు ఏర్పాటు చేసి తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు.
వృద్ధులు, మహిళలు, యువకులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో ఒక నెల రోజులు గడపడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. గత పదేళ్లు వీరు అందిస్తున్న సేవలకు పలువురు ప్రశంసలు కురిపించారు. కార్యక్రమంలో ముచ్చుమర్రి భాస్కరరావు, ప్రమీల, నాగరాజు, శివరంజని, తన్మయి తదితరులు పాల్గొన్నారు.