ఆంగ్ల మాధ్యమంతో భవిష్యత్తు
వెనుకబడ్డ విద్యార్థులకు వరం
ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో పెరుగుతున్న అడ్మిషన్లు
డిజిటల్ క్లాసులతో నూతన విధానానికి శ్రీకారం
వనపర్తి, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. భవితకు నవోదయం కలిగేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానుండగా.. పేద, మధ్య తరగతి విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఏర్పడనున్నది. ఆర్థికంగా వెనుకబడిన వారికి వరంగా మారనున్నది. ఈ క్రమంలో వనపర్తి బాలికల హైస్కూల్ ఇంగ్లిష్ మీడియంలో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతున్నది. డిజిటల్ క్లాసులతో కొత్త కార్పొరేట్ స్థాయిలో బోధన చేస్తుండడంతో డిమాండ్ నెలకొన్నది. బల్మూరు మండలం కొండనాగుల ఉన్నత పాఠశాలలో12 ఏండ్లుగా ఆంగ్ల మాధ్యమం కొనసాగుతున్నది. నాగర్‌కర్నూల్ జిల్లాలోనే అత్యధిక విద్యార్థులు ఉన్న పాఠశాలగా గుర్తింపు పొందింది. ‘మన ఊరు-మన బడి’తో విద్యాశాఖ ఈసరస్వతీ నిలయాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నది. దీంతో విద్యార్థులు ఉత్సాహంగా బడిబాట పట్టనున్నారు.
ఒకప్పుడు వనపర్తిలో మామూలు ప్రభుత్వ పాఠశాల.. ప్రస్తుతం ఆంగ్ల బోధనతో విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఇప్పుడు డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. పాతకాలపు చదువు ఉపాధి ఇవ్వదని తెలుసుకుని ఆంగ్లమాధ్యమానికి విద్యార్థులు బదిలీ అవుతూ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. పాఠశాలలో అన్ని తరగతులు ఆంగ్ల మీడియంలో బోధిస్తుండటంతోపాటు బాలికల పాఠశాల కావడంతో అడ్మిషన్లకు ప్రతి ఏటా డిమాండ్ పెరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లబోధన చేసి విద్యార్థులకు ప్రాథమిక దశలోనే ఆంగ్లబోధన జరిగితే మన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని భావించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్లబోధన పాఠశాలలుగా మార్చాలని నిర్ణయించింది. ఇప్పటికే మౌలిక సదుపాయాల కల్పనలో కార్పోరేట్ పాఠశాలలకు మించి సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం ప్రస్తుతం ఆంగ్లబోధనపై దృష్టి సారించింది. ఇప్పటికే ఆంగ్లబోధన జరుగుతున్న పాఠశాలల్లో మంచి ఫలితాలు వస్తుండటంతో రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం కొనసాగాలని నిర్ణయించింది. దీనిద్వారా ఇంగ్లిష్ మీడియం చదవాలని ఆసక్తి ఉండి ఆర్థికంగా వెనుకబడి ఉన్న విద్యార్థులకు ఈ నిర్ణయం వరంగా మారుతుందని అంటున్నారు.
బాలికల పాఠశాలలో డిజిటల్ క్లాసులు
సక్సెస్ పాఠశాలగా కొనసాగుతున్న వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న బాలికల ఉన్నత పాఠశాల ఆంగ్లబోధనలో ముందడుగులో ఉంది. అంతేకాకుండా డిజిటల్ క్లాసులతో కార్పొరేట్ కల్చర్‌ను పుణికి పుచ్చుకుంది. 800 మంది విద్యార్థులున్న పాఠశాలలో 70 శాతం మంది విద్యార్థులు ఆంగ్ల మీడియంలోనే ఉన్నారు. ఒక్కో తరగతికి రెండు నుంచి మూడు సెక్షన్లు ఉన్నాయి. కొవిడ్ పరిస్థితి ఉన్నందున టీచర్లు మాత్రమే పాఠశాలకు వస్తూ ఆన్లైన్లో జూమ్ క్లాసులు తీసుకుంటున్నారు. దీనికోసం విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుని క్లాసులు చెబుతున్నారు. ఎన్సీసీ , యోగా వంటి క్లాసులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సొంత ఖర్చులతో ఇక్కడ డిజిటల్ తరగతుల కోసం అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసి పాఠశాలకు అందించారు. లైబ్రరీ, ప్రయోగశాల, విశాలమైన తరగతి గదులు, నిష్ణాతులైన టీచర్లు ఉండటంతోపాటు ప్రైవేటుకు మించి ఆంగ్లబోధన జరుగుతుండటంతో చాలా మంది బాలికల తల్లిదండ్రులు పాఠశాలలో అడ్మిషన్ల కోసం పోటీ పడుతున్నారు.
బాలికలకు రక్షణ ఉండటం, ఆంగ్ల విద్యాబోధన జరుగుతుండటంతో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం కూడా ఉండటంతో విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. ఆంగ్లంలో పట్టు ఉండటంతో ఇదే పాఠశాలలో చదివిన విద్యార్థినులు ఐఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సంపాదించుకుని చదువులు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా జాతీయ క్రీడల్లో రాణిస్తున్నారు. ట్రిపుల్ ఐటీల్లో ఇక్కడ చదివిన విద్యార్థినులకు సీట్లు వచ్చాయి. విదేశాల్లో కూడా ఉన్నత కొలువుల్లో ఉన్నారు.
విప్లవాత్మక నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల విద్య బోధన పూర్తిస్థాయిలో అందించాలనుకోవడం విప్లవాత్మక నిర్ణయం. దీనివల్ల ప్రైవేటు ఫీజులు మోయలేని గా మారి చదువుకు దూరమవుతున్న కుటుంబాలకు వరం. పేద, మధ్య తరగతి విద్యార్థలు ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చు. పాఠశాల స్థాయి దాటిన తర్వాత ఉన్నత విద్య మొత్తం ఇంగ్లిష్ మీడియంలోనే ఉంటుంది. ప్రాథమిక విద్య దశ నుంచే ఆంగ్లం మీద విద్యార్థులకు పట్టుంటే ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశముంది. ఆంగ్లం బోధిస్తున్న పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు స్వస్తి చెప్పి ప్రభుత్వ బడుల వైపు పయనమవుతున్నారు. ఇది మంచి నిర్ణయం ప్రజలే కాకుండా ఉపాధ్యాయులు కూడా స్వాగతిస్తున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భావి తరాల భవిష్యత్తు బంగారుమయమవుతుంది.
– ఎస్. తారాబాయి, హెచ్ఎం, బాలకల ఉన్నత పాఠశాల, వనపర్తి
ఇంగ్లిష్ ఎంతో
ఆంగ్ల విద్య బోధన చాలా ఉపయోగపడుతున్నది. నేను జాతీయస్థాయిలో ఎన్సీసీతోపాటు హాకీ క్రీడాకారిణిగా రాణిస్తుండటానికి ఇంగ్లిష్ ఎంతో ఉపయోగపడుతున్నది. వివిధ ప్రాంతాల క్రీడాకారులను కలిసినప్పుడు, సీనియర్ల నుంచి సలహాలు స్వీకరించడానికి ఆంగ్లం ఎంతో ఉపయోగపడుతున్నది. పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదివితే నిజంగా బాగుంటుంది.
– కే అనిత, పదో తరగతి, జాతీయ హాకీ క్రీడాకారిణి